KBR Park | సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : అంతా హడావుడి తప్ప ప్రణాళిక ఉండదు. కార్యాచరణ అస్సలు రూపొందించరు. సమావేశాల మీద సమావేశాలు పెడుతారు కానీ నిర్ణయాలు తీసుకోవడంలో ఎడతెగని జాప్యం చేస్తారు. ఇదీ బల్దియా స్టాండింగ్ కౌన్సిల్ తీరు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 15 అంశాలపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలపనున్నారు. ముఖ్యంగా ఈ స్టాండింగ్ కమిటీ సమావేశంలో హెచ్ సిటీ ప్రాజెక్టు పనుల్లో భాగంగా భూ సేకరణకు ప్రాధాన్యత ఇచ్చారు.
అయితే గత స్టాండింగ్ కమిటీలో సభ్యులు తిరస్కరించిన ప్రతిపాదనలనే మళ్లీ ఈ సమావేశంలో పొందుపర్చడం, కొత్తగా కేబీఆర్ పార్కు చుట్టూ ఎవరెవరి ఆస్తులను గుర్తించారు? ప్రముఖులు ఎవరు ఉన్నారు? అన్న సమగ్ర వివరాలు లేకుండానే రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఆమోదానికి పంపడం దీనికి సభ్యులు ఎలా స్పందిస్తారన్న చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కేబీఆర్ పార్కు చుట్టూ హెచ్ సిటీ ప్రాజెక్టు కింద తమ ఆస్తులను ఇచ్చేందుకు ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం, ఇటీవల సినీ హిరో అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి సైతం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపిన సందర్భాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే నేటి సమావేశంలో 105 ఆస్తులకు సంబంధించి సభ్యులు ఏ విధంగా స్పందిస్తారన్న ఉత్కంఠగా మారింది. వీటితో పాటు బండ్లగూడ మండలం కందికల్ గ్రామంలో మిధాని బస్‌స్టేషన్, బస్ డిపో నిర్మాణానికి టీజీఎస్ ఆర్టీసీకి కేటాయించిన 5.37 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎన్ఓసీ జారీ చేసేందుకు జీహెచ్ఎంసీకి సిఫారస్సు చేస్తూ కమిటీ ఆమోదానికి ప్రతిపాదించారు. బుద్దభవన్లో నాలుగో అంతస్తు ఏ బ్లాక్‌లో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లీజు వ్యవధి తదుపరి రెండు సంవత్సరాల పొడగింపునకు , అద్దె పెంపు, బోరబండలోని స్లమ్ ఏరియాలో నిరుద్యోగ యువత, నిరుపేద మహిలలకు సీఎస్ఆర్ కింద లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ సొంత నిధులతో సెంటర్ ఫర్ స్కిల్లింగ్ అండ్ లవ్లీ హుడ్ ప్రోగ్రాం ద్వారా శిక్షణలు నిర్వహించేందుకు ఒక ఏడాది పాటు జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్‌ను స్వాధీనం చేసేందుకు అనుమతి ప్రతిపాదనపై సభ్యులు చర్చించనున్నారు.