సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ): ఓ వైపు సంస్థ ఆర్థిక కష్టాల్లో ఉందని చెప్పుకొంటూ..సామాన్యుల నుంచి ఆస్తి పన్ను, చిన్న వ్యాపారుల నుంచి ట్రేడ్ లైసెన్స్‌ల రూపంలో ముక్కు పిండి వసూలు చేస్తున్న బల్దియా అధికారులు.. గజం స్థలానికి రూపాయికి అద్దె చెల్లిస్తున్న లీజు ఒప్పందాలు ముగిసి ఏండ్లు గడిచినా.. పట్టించుకోక ఉండటంపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. లీజు గడువు ముగిసిన వాటిని స్వాధీనం చేసుకోవడంలో ఎస్టేట్ విభాగం పూర్తిగా విఫలమైంది. అంతేకాదు స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనలో మేయర్ షాపుల లీజుల గడువు ముగిసినట్లు గుర్తించి.. వెంటనే వారిని ఖాళీ చేయించి.. కొత్తగా టెండర్లు పిలవాలని ఆదేశించి.. ఎనిమిది నెలలు గడిచినా.. ఎలాంటి పురోగతి సాధించలేదు. ఎస్టేట్ విభాగం అధికారుల పనితీరుకు ఆజాద్(మోతీ) మార్కెట్ లీజులు అద్దం పడుతున్నాయి.
మోతీ మార్కెట్ ఒక్కటే కాదు.. చాలా ప్రాంతాల్లో ఇదే వ్యవహారం నడుస్తున్నా.. కనీస చర్యలు తీసుకోకపోవడం..నామమాత్రంగా నోటీసులు ఇచ్చి వారిని ఖాళీ చేయించడంలో తాత్సారం చేస్తున్నారు. ఈ విషయంలో కొందరు అధికారులు లీజుదారుల నుంచి అమ్యామ్యాలకు అలవాటుపడినట్లు ప్రచారం జరుగుతున్నది.
జీహెచ్ఎంసీ ఆస్తులను దశాబ్దాల కిందట అద్దెకు తీసుకొని గడువు ముగిసినా.. వాటిని ఖాళీ చేయకుండా ఇతరులకు అప్పగించకుండా అడ్డుపడుతున్న లీజుదారులు.. వాటిని సబ్ లీజులకు ఇచ్చి లక్షల రూపాయలు అద్దెలు వసూలు చేసుకొని జీహెచ్ఎంసీకి కేవలం వేలల్లో మాత్రమే చెల్లిస్తున్నారు. చాలా చోట్ల ఇదే జరుగుతున్నది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 22 మార్కెట్లు ఉండగా, వాటిలో 2152 స్టాళ్లు ఉన్నాయి. వెజిటేబుల్ మార్కెట్లు 5, నాన్ వెజ్ మార్కెట్లు 7, రెండు కలిపి 10 ఉన్నాయి.
మున్సిపల్ కాంప్లెక్స్‌లు 19, యూనిట్లు 715 వరకు, మోడల్ మార్కెట్లు 37, 589 షాపులు ఉన్నాయి. సుమారు రెండు దశాబ్దాల నుంచి అద్దెలు చెల్లించని వ్యాపారులు ఉన్నట్లు గుర్తించి.. నోటీసులు జారీ చేసిన అధికారులు.. ఇందులో సగం కూడా ఖాళీ చేయించలేదని తెలుస్తోంది. 14 యూనియన్ కార్యాలయాలతో పాటు 2300 షాపుల లీజుదారులకు నోటీసులు ఇచ్చామని ప్రకటించిన ఎస్టేట్ విభాగం.. ఇందులో సాధించిన పురోగతి శూన్యమనే చెప్పాలి.