సిటీబ్యూరో: ప్రచారం దండి.. ఖజానాకు గండి అన్నట్లు..అక్రమంగా ఏర్పాటైన హోర్డింగులతో.. జీహెచ్ఎంసీ ఖజానాకు జరుగుతున్న నష్టానికి లెక్కేలేదు. కేబీఆర్ పార్కు చుట్టూ , ప్రధాన రహదారి సెంట్రల్ మీడియన్‌లో లాల్పాప్స్ (ప్రకటనల బోర్డులు) దర్శనమిస్తాయి. రికార్డుల కంటే అత్యధికంగా అనధికారికంగా ఉంటాయన్నది ప్రధాన ఆరోపణ. ఈవీడీఎంలో ఇటీవల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారి నెలకు రూ. 5 లక్షల మేర ముడుపులు సదరు ఏజెన్సీ నుంచి అందుతున్నాయన్నది బలంగా వినిపిస్తున్న ఆరోపణ.
హోర్డింగ్ పాలసీలో భాగంగా నగరంలో ఎక్కడైనా 15 మీటర్ల కంటే ఎత్తు ఉన్న హోర్డింగ్‌లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. 15 మీటర్ల వరకు ఉన్న హోర్డింగ్‌లు సైతం పక్కాగా నిబంధనల ప్రకారం నడపాలి. సదరు ఏజెన్సీలు మెట్రో పిల్లర్లే లక్ష్యంగా అర్ధరాత్రి వేళ..హోర్డింగ్‌ల ఏర్పాటులో నిబంధనలు పాటించడం లేదు. ఈ తరహా సర్దార్ పటేల్ రోడ్ (శివాజీనగర్), సైబర్ సిటీ టవర్, శిల్పారామం రోడ్ ఇలా కొన్ని చోట్ల అర్ధరాత్రి పూట వయా డక్ట్ హోర్డింగ్ పనులు జరుపుతున్నారు.
ఈ పనులను పర్యవేక్షించే అధికారులు లేరు. ప్రమాదకర స్థాయిలో ఈ పనులు జరుగుతున్నాయన్నది ఆరోపణ. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో కొన్ని సంవత్సరాల కిందటే భారీ హోర్డింగ్‌ను తొలగించారు. అయితే తాజాగా పీటీఐ నంబర్ 1100630829తో దాదాపు రూ. 10 లక్షలకు పైగా హోర్డింగ్ ట్యాక్స్ వేశారు. హోర్డింగ్‌తో ఉన్న ఆదాయాన్ని కోల్పోయిన ప్రెస్‌క్లబ్‌కు అధికారులు.. కొత్తగా జారీ చేసిన ఆస్తిపన్ను రశీదు చూసి కంగుతిన్నారు. మొత్తం ఉదంతాల్లో అధికారుల అవినీతి, అక్రమాలు, పనితీరు ఏవిధంగా ఉన్నదో అర్థ్ధమవుతున్నది.
యూనిపోల్స్, లాలీపాప్స్, హోర్డింగు ఇలా అనేక ఉన్న ప్రాంతాలు అధికారుల రికార్డులు లెక్కలకు , క్షేత్రస్థాయిలో ఉన్న వాటికి ఎక్కడ పొంతన ఉండటం లేదన్నది ఇటీవల వస్తున్న బలమైన ఆరోపణలు .ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీకి రావాల్సిన అడ్వర్టయిజ్మెంట్ ట్యాక్స్ రూ. 500 కోట్లను కొందరు అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని, అక్రమ హోర్డింగ్స్లు, మాల్స్‌లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసిన వారు ‘కార్తిక్’ ట్యాక్స్ చెల్లిస్తున్నారని ఇటీవల జరిగిన కౌన్సిల్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, బీజేపీ కార్పొరేటర్ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రకటనల రూపంలో వందల కోట్లు రావాల్సిన చోట కేవలం రూ.20కోట్లు మాత్రమే వస్తుండడం పట్ల కార్పొరేటర్లు తీవ్రంగా తప్పుపట్టారు. తక్షణమే సభ్యుల డిమాండ్ మేరకు మేయర్ ప్రకటనల విభాగంలో జరుగుతున్న అక్రమాల నిగ్గు తేల్చేందుకు హౌస్ కమిటీని ఏర్పాటు చేస్తూ తీర్మానం చేశారు.