సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ ) :వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నా.. బల్దియా మొద్దునిద్ర వీడటం లేదు. అగ్నిమాపక శాఖ, హైడ్రా, పోలీస్ శాఖల సమన్వయంతో వాణిజ్య సముదాయాలపై స్పెషల్ డ్రైవ్ పెట్టాల్సిన అధికారులు.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నగరం నలువైపులా దాదాపు 23వేలకు పైగా గోడౌన్లు ఉండగా, ఇందులో కనీసం 20 శాతం భవనాలకు కూడా ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేవన్న ఆరోపణలు ఉన్నాయి. వీటికి తోడు వాణిజ్య సముదాయాలులక్షల్లో ఉండగా, తనిఖీలు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి.
నాలుగు కేటగిరీల్లో..
గ్రేటర్లో వ్యాపారాలు జరుగుతున్న ప్రాంతాలను జీహెచ్ఎంసీ అధికారులు నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఇందులో ఇండివిడ్యువల్ షాపులు ఉన్న వారిని మొదటి కేటగిరీలో చేర్చారు. వీరు రెండు స్మోక్ డిటెక్టర్లతో పాటు రెండు అగ్ని మాపక సిలిండర్లు అందుబాటులో ఉంచుకోవాలి. రెండో కేటగిరీలో గ్రూప్ ఆఫ్ బిజినెస్‌లు ఉన్నాయి.
ఒకే బిల్డింగ్‌లో ఎక్కువ షాపులు ఉన్న వారు ఈ కేటగిరీ కిందికి వస్తారు. ఇందులో అందరూ కలిపి కామన్‌గా ఫైర్ సేఫ్టీ సిస్టమ్‌ను అమర్చుకోవాల్సి ఉంటుంది. మూడో కేటగిరీలో బిల్డింగ్ యాజమానులు తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి. వీరు బిల్డింగ్‌లోని సెల్లార్లు క్లీన్ చేయడం, ఫైర్ ఎగ్జిట్ తదితరాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటు ంది.నాలుగో కేటగిరీలో గోదాములు ఉన్నా యి. టింబర్ డిపోలు, వేస్ట్ పేపర్ గోదాములు ఈ కేటగిరీ కిందికి వస్తాయి.
గోదాములపై తనిఖీలేవీ?
16 నెలల కాలంలో అనేక గోదాములు అక్రమంగా వెలిసిన చర్యలు తీసుకోలేదు. ప్రమాదంగా జనావాసాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న గోదాంలతో ప్రజలు కలవరానికి గురవుతున్నారు. అగ్గికి ఆజ్యం పోసే చెత్త వస్తువులు గోదాములు జనావాసాల్లోని తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం అనుమతి లేని గోదాములు సుమారు 8, 500వేల పైనే ఉన్నట్లు అంచనా.