సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): వాతావరణ శాఖ సూచనల మేరకు గ్రేటర్ పరిధిలో వచ్చే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదానికి ఆస్కారం ఉన్న ప్రదేశాలపై నిరంతరం నిఘా పెట్టాలని జోనల్ సర్కిల్, వార్డు అధికారులను జీహెచ్ఎంసీ కర్ణన్ ఆదేశించారు.
గురువారం రాజేంద్రనగర్ సర్కిల్లో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్, అధికారులతో కలిసి కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. జల్పల్లి చెరువుతో పాటు వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. ట్రాఫిక్, విపత్తు బృందాలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. వరద నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి నీటిని తొలగించాలన్నారు. వర్షాకాలంలో ట్రాఫిక్, విపత్తు స్పందన బృందాలు సమన్వయం చేసుకుంటూ జనజీవనానికి ఆటంకం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు.
దోమల నియంత్రణకు విస్తృత చర్యలు..
గ్రేటర్లో దోమల నివారణకు డ్రోన్ స్ప్రేయింగ్ చేపడుతున్నట్లు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారులు తెలిపారు. కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు అన్ని జోన్లు, సర్కిళ్లలో యాంటి లార్వా, యాంటి అడల్ట్ మస్కిటో కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి కేసులను తగ్గించేందుకు వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు 4.846 కాలనీల్లో నీటి నిల్వలు ప్రదేశాలు, చెరువులు, కుంటల్లో గాంబుషియా చేపలు, అయిల్ బాల్స్ విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
లోతట్టు ప్రాంతాలు, సెల్లార్లు, నిర్మాణ క్షేత్రాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తూ ఇండోర్ పైరిథ్రమ్ స్పేస్ స్ప్రే, లార్వల్ సర్వేలు చేపడుతున్నట్లు తెలిపారు. ఒక్కో జోన్కు ఒక్కో ఫ్లోట్ ట్రాష్ కలెక్టర్ల ద్వారా గుర్రపు డెక్కలను, కుళ్లిన మొక్కల వ్యర్థాలను తొలగిస్తూ దోమలు వృద్ది చెందకుండా చూస్తుందన్నారు. లార్వా ఆపరేషన్లను జియో ట్యాగ్ చేశామని, దోమల నియంత్రణ విస్తృత చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా కమిషనర్ పేర్కొన్నారు.