అవస్థలకు చెల్లుచీటి

- ఎస్ఆర్డీపీతో మారిన నగర చిత్రం
- శాశ్వతంగా తీరిన ట్రాఫిక్ కష్టాలు
- ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లతో సులభ ప్రయాణం
- ఇప్పటివరకు 21 ప్రాజెక్టులు పూర్తి
- తాజాగా అందుబాటులోకి బాలానగర్ ఫ్లైఓవర్
- ప్రారంభించిన పురపాలక మంత్రి కేటీఆర్
- ఎస్ఆర్డీపీతో ట్రాఫిక్ సమస్యకు చెక్
- ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్న ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ రహదారులు
- నిమిషం కూడా నిలువని వాహనాలు
- ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రాష్ట్ర సర్కార్
ట్రాఫిక్ నరకయాతన.. గంటల తరబడి జామ్జాటంలతో ఇబ్బందిపడిన నగరవాసులకు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. సుమారు రూ.24 వేల కోట్ల వ్యయంతో ప్రభుత్వం వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ)ను ప్రారంభించింది. ఈ స్వల్ప వ్యవధిలోనే రూ.1010.77 కోట్లు ఖర్చు చేసి 21 ప్రాజెక్టులను పూర్తి చేసింది. వీటిలో 11 ఫ్లైఓవర్లు, 4 అండర్‌పాస్‌లు, 4 ఆర్వోబీ/ఆర్‌యూబీలు, 1 కేబుల్ బ్రిడ్జి, 1 బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చారు. తాజాగా రూ.387 కోట్ల వ్యయంతో 1.3 కి.మీ పొడవున బాలానగర్ చౌరస్తాలో నిర్మించిన ఫ్లైఓవర్‌ను మంగళవారం పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రులు మల్లారెడ్డి, తలసాని, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
నగరంలో నెలకొన్న ట్రాఫిక్ చిక్కులకు తెలంగాణ ప్రభుత్వం పరిష్కారం చూపుతున్నది. నగర వాసుల ట్రాఫిక్ చిక్కులను పరిష్కరించేందుకు వేల కోట్ల వ్యయంతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ)కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శరవేగంగా నిర్మాణ పనులు పూర్తిచేసుకుని వరుసగా అందుబాటులోకి వస్తున్న ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లతో నిమిషం కూడా నిలువకుండా వాహనాలు రయ్యుమంటూ దూసుకుపోతున్నాయి. నిన్నటిదాకా అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లు లేక గంటల తరబడి అవస్థలు పడిన జనం నిమిషాల్లో గమ్యం చేరుతున్నారు. ఇలా నగరంలో చేపడుతున్న వ్యూహాత్మక రహదారులతో వాహనదారులు ఊరట పొందుతున్నారు. సమైక్య పాలకులు నాలుగు ఫ్లైఓవర్ల నిర్మాణంతోనే హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపామని డబ్బాలు కొట్టుకున్నారు. కానీ తెలంగాణ సర్కారు ప్రజలకు ఇచ్చిన మాట మేరకు మొక్కవోని దీక్షతో రహదారుల అభివృద్ధి పనులను పరుగులు తీయిస్తున్నది. ఇప్పటికే నగరం నలుమూలల అనేక నిర్మాణాలు పూర్తవ్వగా.. తాజాగా బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. మరికొన్ని నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. ముఖ్యంగా నగరంలో ఒక్క నిర్మాణం చేపట్టాలంటే భూసేకరణ పూర్తి చేయడమనేది పెద్ద సవాల్. అలాంటిది.. స్థలాలు కోల్పోయినవారిని సంతృప్తి పరుస్తూ, శరవేగంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్ఓబీ, ఆర్యూబీ వంటి నిర్మాణ పనులు చేపడుతున్నారు.
ట్రాఫిక్, తాగునీటి సమస్యను తీర్చాం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
బాలానగర్‌లో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు మంత్రి తలసాని, అప్పటి ఎంపీ మల్లారెడ్డిలతో కలిసి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి రూ.387 కోట్లు కేటాయింపజేసినట్లు పేర్కొన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య తొలగిపోయిందన్నారు. అదేవిధంగా గతంలో బాలానగర్, ఫతేనగర్‌లలో మంచినీటి ఇక్కట్లతో కుండల ప్రదర్శన జరుగుతుండేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.400 కోట్లు వెచ్చించి 9 మంచినీటి రిజర్వాయర్లు నిర్మించి సమస్యను పూర్తిగా తొలగించామన్నారు.
నేనేంది.. ప్రారంభించుడేంది..!

- ఫ్లై ఓవర్ ప్రారంభంలో రిబ్బన్ కట్ చేసిన కార్మికురాలు శివమ్మ
మంత్రి కేటీఆర్ నా చేతులతో బాలానగర్ ఫ్లై ఓవర్ రిబ్బన్ కట్ చేయిస్తారని ఊహించలేదు. మంత్రి చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యాను. నేనేంది.. ప్రారంభించడం ఏంది అనుకుని భయపడ్డాను. మంత్రి కేటీఆర్ ఏంకాదు కట్ చేయమ్మా.. అని చెప్పారు. పక్కన మంత్రులు ఉండగా నన్ను రిబ్బన్ కట్ చేయమనడం సంతోషంగా అనిపించింది. ప్రజల కష్టాలు తీర్చే.. ఇలాంటి మంత్రి ఉంటే ప్రజలు ఆనంద పడుతారు. నేను ఒక పేదదాన్ని. కార్మికురాలిగా ైఫ్లై ఓవర్ పనుల్లో రెండేండ్లుగా పనిచేస్తున్న. మంత్రి కేటీఆర్ ఇంతగొప్ప పని నాతో చేపించడం సంతోషంగా ఉన్నది.
బాలానగర్ కో ఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమస్య పరిష్కరిస్తాం: మంత్రి కేటీఆర్
బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కేటీఆర్ బాలానగర్ కో ఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బాలానగర్ నర్సాపూర్ చౌరస్తాలోని 47 ఎకరాల ప్రభుత్వ స్థలానికి లీజు గడువు ముగిసి ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా ఆ స్థలంలో పరిశ్రమలు నడిపిస్తున్న నిర్వాహకులు సదరు స్థలాన్ని తమకు విక్రయానికైనా, లీజుకైనా ఇవ్వాలని పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని మంత్రి తెలిపారు. ఎస్టేట్ సభ్యులు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును వెంట తీసుకొని తన వద్దకు వస్తే సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
- పూర్తయిన ఫ్లై ఓవర్లు..! ప్రాజెక్టు వ్యయం ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు రూ.కోట్లలో..
- మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద గ్రేడ్ సెపరేటర్ 131.64
- కామినేని ఆస్పత్రి ఎడమ వైపు ఫ్లై ఓవర్ బ్రిడ్జి 23.20
- ఎల్బీనగర్ చౌరస్తా వద్ద ఎడమ వైపు ఫ్లై ఓవర్ బ్రిడ్జి 20.74
- రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి 97.94
- బయోడైవర్సిటీ వద్ద లెవల్ 2 గ్రేడ్ సెపరేటర్/ ఫ్లై ఓవర్ బ్రిడ్జి 69.47
- బయోడైవర్సిటీ వద్ద లెవల్ 1 గ్రేడ్ సెపరేటర్/ ఫ్లై ఓవర్ బ్రిడ్జి 69.47
- కామినేని ఆస్పత్రి జంక్షన్ వద్ద కుడి వైపు ఫ్లై ఓవర్ బ్రిడ్జి 23.20
- పంజాగుట్ట శ్మశాన వాటిక వద్ద స్టీల్ బ్రిడ్జి 5.95
- బైరామల్ గూడ వద్ద కుడివైపు ఫ్లై ఓవర్ బ్రిడ్జి 38.18
- జూబ్లీహిల్స్ రోడ్ నం.45- దుర్గం చెరువు మార్గంలో 4 లేన్ల ఫ్లై ఓవర్ బ్రిడ్జి 150
- బాలానగర్ (నర్సాపూర్ చౌరస్తా) ఫ్లై ఓవర్ బ్రిడ్జి 387
- అండర్ పాస్‌లు.. రూ.కోట్లలో..
- అయ్యప్ప సొసైటీ జంక్షన్ వద్ద వీయూపీ 49.69
- చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద అండర్ పాస్ 13.25
- ఎల్బీనగర్ చౌరస్తా వద్ద అండర్ పాస్ 17.07
- మైండ్ స్పేస్ చౌరస్తాలో అండర్ పాస్ 20.00
- రోడ్ ఓవర్ బ్రిడ్జి/ రోడ్ అండర్ బ్రిడ్జిలు
- లాలాపేట రోడ్డు, అండర్ బ్రిడ్జి 5.85
- ఉత్తమ్‌నగర్ వద్ద రోడ్డు, అండర్ బ్రిడ్జి 29.39
- ఉప్పుగూడ వద్ద రోడ్డు, అండర్ బ్రిడ్జి 20.27
- కూకట్పల్లి-హైటెక్ సిటీ ఆర్యూబీ 66.59
- దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి రూ. 184
ఎస్ఆర్డీపీలో పూర్తైన పనులు..
ఇప్పటివరకు 21 ప్రాజెక్టు పనులను పూర్తి చేశారు. వీటిలో 11 ఫ్లైఓవర్లు, 4 అండర్‌పాస్‌లు, 4 ఆర్ఓబీ/ఆర్‌యూబీలు, 1 కేబుల్ స్టేయిడ్ బ్రిడ్జి, 1 బ్రిడ్జిని నిర్మించి ప్రారంభించారు. వీటి నిర్మాణం కోసం రూ. 1010.77 కోట్లు ఖర్చు చేశారు.
నాడు అరగంట.. నేడు నిమిషాల్లో..
బాలానగర్‌లో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో పారిశ్రామికవాడ ప్రజలతో పాటు నగరంలోని కుత్బుల్లాపూర్, సనత్‌నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఊరట లభించనున్నది. నిమిషాల వ్యవధిలో గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. బాలానగర్ మీదుగా చింతల్, షాపూర్‌నగర్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, బోయిన్పల్లి, కూకట్పల్లి, మూసాపేట, భరత్‌నగర్ ప్రాంతానికి వెళ్లాల్సినవారు ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడేవారు. అర కిలోమీటర్ ప్రయాణానికే గంట సమయం వేచి ఉండాల్సి వచ్చేది. ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో సమస్య తీరనున్నది. నిమిషాల్లో బాలానగర్ ఎక్స్ రోడ్డు దాటి పోవచ్చు.
పురోగతిలో ఉన్న ప్రాజెక్టులు..
- రూ.4741.97 కోట్లతో 20 ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించిన పనులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి.
- భూసేకరణ, ఇతర సమస్యలతో రెండు చోట్ల నిర్మాణ పనులు ఆగిపోయి ఉన్నాయి. వీటి విలువ రూ. 661.00 కోట్లు
- రూ. 848.80 కోట్లతో మూడు చోట్ల చేపట్టాల్సిన పనులకు సంబంధించి నిర్మాణ సంస్థను ఎంపిక చేయాల్సి ఉంది.
- రూ.1551.47 కోట్ల వ్యయంతో చేపట్టే ఐదు ప్రాజెక్టులు టెండర్ దశలో ఉన్నాయి.
- రూ.880.60 కోట్ల వ్యయంతో చేపట్టే రెండు ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు పరిపాలన అనుమతి లభించింది.
- రూ.2310 కోట్ల విలువగల ఐదు ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు తుది దశలో ఉన్నాయి.
- రూ.12,044 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జాతీయ రహదారుల సంస్థలు కలిపి మొత్తం 12 ప్రాజెక్టులను చేపడుతున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన డీపీఆర్‌ల రూపకల్పన జరుగుతున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

