ముషీరాబాద్, జూన్ 7: బాకారం- సాగర్ లాల్ హాస్పిటల్ రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ గుంతలు, దుమ్ము ధూళితో స్థానికులు అవస్థలు పడుతున్నారు. నెలన్నర క్రితం భారీ పైప్ లైన్ నిర్మాణం కోసం రోడ్డును తవ్వారు. అనంతరం పైప్ లైన్ నిర్మాణం పూర్తయాక జలమండలి అధికారులు మట్టి చదును చేశారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు నెల రోజుల క్రితం రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు సైతం పంపించారు. అప్పటి నుంచి నిధులు మంజూరవుతాయని, పనులు చేపడతామని అధికారులు కాలం వెళ్లదీస్తున్నారు. నిధులు మంజూరు గాక.. రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.
పనులు పూర్తి చేయమని అధికారులను అడిగితే.. నిధులు ఇదిగో వచ్చే, అదిగో వచ్చే అంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో బాకారం- సాగర్ లాల్ హాస్పిటల్ రోడ్డులో రాకపోకలు సాగించడానికి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాహనదారుల రాకపోకలు కష్టతరంగా మారాయి. భారీ గుంతలు, మట్టి కుప్పలు ఉండటంతో ఆ మార్గం గుండా వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మట్టికుప్పలతో రోడ్డంతా అధ్వాన్నంగా తయారై ప్రజలు, వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దాదాపు అర కిలోమీటర్ దూరం రోడ్డంతా గుంతలమయంగా మారడంతో ఈ రోడ్డున వెళ్లాలంటే జంకుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.