కొండాపూర్, ఆగస్టు 23 : సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ పరిధి మాదాపూర్ సర్కిల్ అంజయ్యనగర్‌లో కుప్పకూలిన ఏడు అంతస్తుల అక్రమ భవన నిర్మాణ శిథిలాలు తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. హైడ్రా, డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శిథిలాల తొలగింపు పనులు పర్యవేక్షిస్తున్నాయి. కేవలం 50 గజాల్లో నాలాను ఆక్రమించి చేపట్టిన ఏడు అంతస్తుల అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో విఫలమైన మాదాపూర్ సరిల్ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ అఫీసర్ సంతోష్ కుమార్‌పై సీఎంసీ కమిషనర్ సృజన సస్పెన్షన్ వేటు వేశారు. అక్రమ భవన నిర్మాణం చేపట్టిన నిర్మాణదారులు ఫర్హీన్ సిద్ధిక్, ఎండీ సాజిద్‌లపై మాదాపూర్ సరిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు ఆ ఇద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేయగా, ఎండీ సాజిద్‌ను అరెస్ట్ చేశారు. కుప్పకూలిన భవనం శిథిలాలు పకనే ఉన్న మూడు భవనాల మీద పడటంతో దెబ్బతిన్నాయి. ఇందులో పకనే ఉన్న మరో ఏడు అంతస్తుల భవనం కూల్చివేసేందుకు హైడ్రా బాహుబలి యంత్రం ఆదివారం సాయంత్రానికి ఘటన స్థలానికి చేరుకుంది. శిథిలాల తొలగింపు పనులు పూర్తి అయినా తర్వాత బిల్డింగ్ కూల్చివేత పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
శిథిలాల తొలగింపు పనులు..
శనివారం మధ్యాహ్నం ఒకసారిగా కుప్పకూలిన ఏడు అంతస్తుల భవన శిథిలాలను హైడ్రా, డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ బృందాలు తొలగింపు పనులు చేపట్టాయి. జయదర్శి అపార్ట్మెంట్ సీ బ్లాక్‌లోని ఐదు ప్లాట్లపై పడ్డ శిథిలాలను తొలగిస్తున్నారు. కాగా అపార్ట్మెంట్ సీ బ్లాక్ నివాసితులు మరో రెండు, మూడు రోజుల పాటు తమ ఇండ్లకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. శిథిలాల తొలగింపు పనులు నెమ్మదిగా జరుగుతుండడం, బిల్డింగ్ నాణ్యత పరీక్షలు నిర్వహించే దాకా.. నివాసితులు తమ ప్లాట్లలో ఉండవద్దని అధికారులు వారికి సూచించారు. దీంతో తెలిసిన వారు, బంధువు ఇండ్లలో, అపార్ట్మెంట్ క్లబ్ హౌస్‌లో తలదాచుకుంటున్నారు. ఎవరెవరో చేసిన తప్పులకు తాము శిక్ష అనుభవిస్తున్నామంటూ ఆవేదన చెందుతున్నారు. దేవుడి దయతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, జరిగిన ఘోరాన్ని తలుచుకుంటుంటేనే భయమేస్తుందంటున్నారు.
దెబ్బతిన్న మరో ఏడు అంతస్తులు
భవన నిర్మాణ శిథిలాల తొలగింపు పనులు ఆదివారం సాయంత్రానికి ముగింపు దశకు వచ్చాయి. శిథిలాలు పడి పకనే ఉన్న మరో ఏడు అంతస్తుల అక్రమ నిర్మాణం తీవ్రంగా దెబ్బతింది. ఈ భవనం ఎప్పుడు కూలుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. శనివారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హైడ్రా, సీఎంసీ కమిషనర్లు దెబ్బతిన్న ఆ భవనాన్ని పూర్తిగా కూల్చివేస్తామని తెలిపారు. దీంతో భారీ భవనాలను కూల్చివేసే హైడ్రా బాహుబలి యంత్రం ఆదివారం సాయంత్రం వైట్‌ఫీల్డ్ రోడ్డుకు చేరుకుంది. భారీ యంత్రంతో కూల్చివేత పనులు చేపట్టారు. ముందు జాగ్రత్తగా బిల్డింగ్ చుట్టూ ఉన్న నివాసితులను అధికారులు ఖాళీ చేయించారు.
అక్రమ నిర్మాణాలను కూలుస్తారా
అంజయ్యనగర్ చుట్టూ ఐటీ కంపెనీలు కొలువై ఉండడంతో అంజయ్యనగర్‌లో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. హాస్టళ్లకు భారీ డిమాండ్ ఉండడంతో బిల్డర్లు ఆత్యాశకు పోతూ 50, 60 గజాల్లోనే ఆరు, ఏడు అంతస్థులకు తకువ కాకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ భవనాల్లోనే హాస్టళ్లు, ఓయో హటళ్లు నిర్వహిస్తున్నారు. బిల్డర్ల అత్యాశకు టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది అంటకాగుతున్నారు. శనివారం మధ్యాహ్నం అంజయ్యనగర్‌లో నాలాపై కేవలం 50 గజాల్లో వెలసిన ఏడు అంతస్తుల అక్రమ నిర్మాణం కుప్పకూలి ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంజయ్యనగర్‌లో వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని ప్రకటనలు చేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తారా ? లేదా పది రోజులు హడావుడి చేసి చేతులు దూలుపుకొని, పాత కథనే పునరావృతం చేస్తారా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో సిద్ధిక్‌నగర్‌లో భవనం ఒరిగిపోయిన సమయంలోనూ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామంటూ చెప్పారు. అనంతరం పట్టించుకోకపోవడంతో సీజ్ చేసిన అక్రమ నిర్మాణాలన్నీ ప్రస్తుతం హాస్టళ్లు, ఓయో రూమ్‌లు, రెసిడెన్షీయల్గా కొనసాగుతున్నాయి.
టీపీబీఓ ఒక్కడిదేనా తప్పంతా?
అంజయ్యనగర్‌లో కూలిన అక్రమ నిర్మాణం వెనకా మాదాపూర్ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ప్రొఫెషనల్ ఆఫీసర్ (టీపీబీఓ) నిర్లక్ష్యమంటూ, అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ.. సంతోష్‌కుమార్‌ను సీఎంసీ కమిషనర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం టీపీబీఓ ఒక్కడే నిర్లక్ష్యంగా వ్యవహరించారా? కింది స్థాయి, పైస్థాయి ఉన్నత అధికారుల ప్రమేయం ఏమాత్రం లేకపోవడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించే చైన్‌మెన్, ఏసీపీ, సర్కిల్ పెద్ద ఉప కమిషనర్లకు అక్రమ నిర్మాణాలపై కనీస అవగాహన లేకుండా ఉన్నారా అంటున్నారు. ఇటీవలే అంజయ్యనగర్‌లోని వార్డు కార్యాలయంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలను జేసీబీలతో భయపెట్టి మరీ తొలగించిన డీసీకి, పక్కనే కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు కనిపించలేవా అని ప్రశ్నిస్తున్నారు. గుడిసెల తొలగింపు చేపట్టిన రోజునే అక్రమ నిర్మాణాలపై నజర్ పెట్టుంటే ఇంత అనర్ధం జరిగేదేది కాదంటున్నారు. సర్కిల్ పరిధిలో జరిగిన సంఘటనకు టౌన్‌ప్లానింగ్ విభాగంతో పాటు డీసీ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
మాదాపూర్ సరిల్ టీపీబీవో సస్పెన్షన్
కొండాపూర్, ఆగస్టు 23 : గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో అనుమతులు లేకుండా నిర్మించిన ఏడంతుస్తుల భవనం కూలి ఇద్దరు మృతి చెందిన ఘటనపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) చర్యలు చేపట్టింది. మాదాపూర్ సరిల్ 50 టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ప్రొఫెషనల్ ఆఫీసర్ (టీపీబీవో)సంతోష్ కుమార్‌ను సస్పెం డ్ చేస్తూ కమిషనర్ సృజన ఆదేశాలు జారీ చేశారు. అనధికారికంగా కొనసాగుతున్న నిర్మాణాన్ని అడ్డుకోవడంలో అధికారి విఫలమయ్యారని, దీంతో ప్రాణనష్టం సంభవించడంతో పాటు పకనే ఉన్న భవనం దెబ్బతిన్నట్లు ఉత్తర్వుల్లో పేరొన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంపై క్రమశిక్షణ చర్యలు చేపట్టనున్న నేపథ్యంలో సంతోష్ కుమార్ సస్పెండ్ తక్షణమే అమలులోకి వస్తుందన్నారు. సస్పెన్షన్ కాలంలో ఆయ న హెడ్ క్వార్టర్స్ స్థానిక పరిధిలోనే ఉండాలని, ఉన్నతాధికారి ముందస్తు అనుమతి లేకుం డా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశించారు.
నిర్మాణ దారులపై కేసులు..
భవనం కూలిన ఘటనపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భవన యజమానులు ఫర్హీన్ సిద్ధిఖ్, మహ్మద్ సాజిద్ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినట్లు అధికారులు పేరొన్నారు. నాణ్యత లేని నిర్మాణ సామగ్రి, సాంకేతిక పర్యవేక్షణ లేకపోవడం వల్లే భవనం కూలినట్లు ప్రాథమికంగా గుర్తించారు. యజమానులపై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు.