Badangpet | బడంగ్ పేట్, మే 2: బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో బడ్జెట్ ఉన్నది రూ.6కోట్లు అయితే వందల కోట్ల పనులు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంచనాలకు మించి అభివృద్ధి పనులు చేయడం పట్ల ఆరోపణలు వస్తున్నాయి. అడ్డగోలుగా పనులు చేయడం పట్ల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేక అధికారి సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. ఇటీవల మున్సిపల్ అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్ని నిధులు ఉన్నాయని ఆరా తీశారు. అసలు చేసిన పనులకు ఇవ్వవలసినది ఎంత ఉందని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా చేయవలసిన పెండింగ్ పనులు ఎన్ని ఉన్నాయో వాటి జాబితా తయారు చేయాలన్నారు. ముందస్తు చేసిన పనులు ఎన్ని, వాటికి ఎంత ఇవ్వాలి అని అధికారులను అడిగి వివరాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఎన్ని పనులకు ఏ ఏ ఎజెండాలో ఎన్ని తీర్మానాలు చేశారో వివరాలతో మరో సమావేశంలో చర్చిస్తానని అధికారులతో అన్నట్టు తెలిసింది.
బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న బడ్జెట్ రూ. 6 కోట్లు
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం రూ. 6 కోట్ల నిలువ బడ్జెట్ ఉన్నట్లు అకౌంటెంట్ పేర్కొంటున్నారు. చేసిన అభివృద్ధి పనులకు రూ. 45.88 కోట్లు కాంట్రాక్టర్లకు ఇవ్వవలసి ఉందని డి ఈ వెంకన్న పేర్కొన్నారు. ముందస్తు చేసిన 50 పనుల లెక్కలు ఇంకా తేల్చలేదు. ఇంకా తీర్మానాలు చేసిన పనులు చేయవలసి ఉంది. బడ్జెట్ అంచనాలకు మించి పనులు చేయించిన అధికారుల తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చాలామంది పనులు చేసిన కాంట్రాక్టర్లకు కోట్లలో డబ్బులు ఇవ్వవలసి ఉంది. అధికారులు మాత్రం ఎక్కువ పర్సంటేజ్ ఎవరైతే ఇస్తారో వారి చెక్కులను మాత్రమే ముందు రాస్తున్నారని చాలామంది కాంట్రాక్టర్లు ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. కొంతమంది విజిలెన్స్ అధికారులకు కూడా ఫిర్యాదులు చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో జరుగుతున్న అవకతవకలపై అనేక ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.
పెండింగ్ పనుల వివరాలు:
ఫిబ్రవరి 2024లో కౌన్సిల్ మీటింగ్‌లో తీర్మానం చేసిన పనులు 407. అందులో పూర్తి చేసిన పనులు 356. పెండింగ్ పనులు 68 ఉన్నాయి. చేసిన పనులకు రూ.3.36 కోట్లు చెల్లించవలసి ఉంది. ఆగస్టు 2024 కౌన్సిల్ సమావేశంలో 408 పనులకు తీర్మానం చేశారు. 262 పనులను పూర్తి చేశారు. 145 పెండింగ్ లో ఉన్నాయి. చేసిన పనులకు రూ. 13.08 కోట్లు చెల్లించవలసి ఉంది. డిసెంబర్ 2024 సంవత్సరంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో 538 పనులకు తీర్మానం చేశారు. 232 పనులు పూర్తి చేశారు. 322 పనులు పెండింగ్ లో ఉన్నాయి. చేసిన పనులకు రూ. 28.06 కోట్లు ఇవ్వవలసి ఉంది. ప్రస్తుతం చేసిన పనులన్నింటికీ రూ 45.88 కోట్లు చెల్లించవలసి ఉంది. బడ్జెట్ మాత్రం 6 కోట్ల ఉంది ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తీసుకువస్తారని ప్రత్యేక అధికారి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ముందస్తు చేసిన పనుల లెక్క తేలేదు ఎప్పుడు :
మున్సిపల్ కార్పొరేషన్లో అడ్డగోలుగా ముందస్తు పనులు చేశారు . చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదు ఇప్పటివరకు. పనులు ఒకరు చేస్తే టెండర్ మరొకరికి వచ్చింది. వాటిని తేల్చకుండా అధికారులు అలాగే మూసి పెట్టారు. దీంతో కాంట్రాక్టర్ల మధ్యన నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అధికారులు చెప్తేనే ముందస్తు పనులు చేసినట్లు కాంట్రాక్టర్లు చెప్తున్నారు. అధికారులు మాత్రం 50 వర్కులు మాత్రమే చేసినట్లు చెప్తున్నారు. ఈ ముందస్తు చేసిన పనుల చిక్కుముడి వీడేది ఎప్పుడోనని కాంట్రాక్టర్లు ఆందోళనలో ఉన్నారు.
అడ్డగోలుగా తీర్మానాలు:
జనవరి 2025 నిర్వహించిన కౌన్సిల్ సమావేశం లో తీర్మానాలకు లెక్కలే లేవు. అడ్డగోలుగా తీర్మానాలు చేశారన్న వాదనలు బలంగానే ఉన్నాయి. అసలు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న నిధులు రూ. 6 కోట్లు మాత్రమేనని గణాంకాలు అధికారులు పేర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం సిబ్బంది జీతభత్యాలకు సంబంధించి నాలుగు నెలల వరకు సరిపడు బడ్జెట్ ఉండాలి. నిధులు లేకుండానే అడ్డగోలుగా తీర్మానాలు చేయడం జరిగింది. నిధులు లేకుండా వందల కోట్లకు తీర్మానాలు చేయడం పట్ల ప్రత్యేక అధికారి మున్సిపల్ సిబ్బందిపై గురువుగా ఉన్నట్లు తెలిసింది. పై అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఎజెండాలో ఉన్న అంశాలను వేటిని ఉంచాలో వేటిని తొలగించాలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. జనవరి మాసంలో జరిగిన కౌన్సిల్ తీర్మానాలను పక్కన పెట్టే ఆలోచన ఉన్నట్లు తెలిసింది. వీటన్నింటిని అధికారులు ఎలా అధిగమిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిధులన్నీ దుబారా చేశారన్న వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. బడంగ్ పేటలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఇప్పటికే చాలామంది విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. కాంట్రాక్టర్లే ఇంజనీరింగ్ విభాగంలో జరిగిన అవతవకలపై విజిలెన్స్ ఎంక్వయిరీ చేయించాలని ఫిర్యాదులు చేశారు. ఈ చిక్కుముడులకు సమాధానం ఎప్పుడు దొరుకుతుందో వేచి చూడాల్సిందే.