సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : సిటీలోని బస్సు షెల్టర్లు కంపు కొడుతున్నాయి. బస్సుల కోసం వచ్చే ప్రయాణికులకు దుర్వాసన, మురుగు కంపు స్వాగతం పలుకుతున్నాయి. దీంతో బస్సు షెల్టర్లలో నిలబడాల్సిన ప్రయాణికులు దుర్వాసన భరించలేక దూరాన నిల్చోవాల్సిన దుస్థితి నెలకొంది. గ్రేటర్‌లోని బస్సుషెల్టర్లలో పారిశుధ్యం పూర్తిగా కరువైంది. పట్టించుకునే నాథుడే లేకపోవడంతో దుర్గంధభరితంగా మారాయి. ప్రతీ రోజు షెల్టర్లన్నీ బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రం చేయాల్సి ఉన్నా.. పట్టించుకోవడం లేదు.
దీంతో కంపు తాండవం చేస్తున్నది. షెల్టర్లను ఆనుకొని ఉన్న గోడలపై మూత్ర విసర్జన చేస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. సికింద్రాబాద్ రైతిఫైల్ బస్టాండ్ ముందర డ్రైనేజీ, మురుగు కంపుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్‌లోకి వెళ్లడానికి రోడ్డు మధ్యలో నిల్చిన డ్రైనేజీ కంపును దాటాల్సి వస్తుండటంతో నరకం చూస్తున్నారు. ముఖ్యంగా మహిళలు నానా అవస్థలు పడుతున్నారు. కవాడిగూడ, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, సికింద్రాబాద్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లోని బస్సు షెల్టర్లన్నీ దుర్వాసనకు నిలయాలుగా మారాయని, చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినా ప్రయోజనం లేదని వాపోతున్నారు.
అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో షెల్టర్లు కంపును తలపిస్తున్నాయని ఫిర్యాదు చేశారు. నగరంలో 2800 బస్సులు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రతీ రోజు 24 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. మహానగరంలో 1370 బస్షెల్టర్లు ఉన్నాయి. అయితే ఈ షెల్టర్ల పరిశుభ్రతను పట్టించుకోవాల్సిన జీహెచ్ఎంసీ, ఆర్టీసీ అధికారులు చేతులెత్తేయడంతో ప్రయాణికులు బస్సు వచ్చే వరకు నరకం చూస్తున్నారు.