ఉమ్మడి రాష్ట్రంలో 2009 వరకు దేశంలోనే అతి పెద్ద శాసనసభ నియోజకవర్గంగా వెలుగొందిన ఖైరతాబాద్ నియోజకవర్గమంటేనే పి.జనార్దన్‌రెడ్డి (పీజేఆర్) పేరు గుర్తొస్తుంది. 2007లో పీజేఆర్ గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోవడంతో.. అనంతరం జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009 సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో విష్ణువర్ధన్‌రెడ్డి ఖైరతాబాద్‌లో భాగంగా ఏర్పడిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, గెలుపొందారు. ఇక.. 2014, 2018 ఎన్నికల్లో అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విష్ణువర్ధన్‌రెడ్డి ఓటమి చెందారు. ఈ నేపథ్యంలో తాజా శాసనసభ ఎన్నికలకు జూబ్లీహిల్స్ నుంచి విష్ణువర్ధన్రెడ్ఢి సిద్ధమవుతున్నారు.
ఈ మేరకు తన అనుచరులు, పార్టీ శ్రేణుల్ని సమాయత్తం కూడా చేసుకున్నారు. కానీ, అనూహ్యంగా జూబ్లీహిల్స్ తెరపైకి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ వచ్చారు. ఎకాఎకిన నియోజకవర్గంలో పర్యటించి.. కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే వస్తుందంటూ ప్రచారం చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన విష్ణువర్ధన్‌రెడ్డి వర్గీయులు అజారుద్దీన్ పర్యటనను అడ్డుకున్నారు. అయితే, హస్తినలో కాంగ్రెస్ పెద్దల ఆశీర్వాదం తనకున్నదని అజారుద్దీన్ చెప్పుకుంటున్నప్పటికీ… ఇక్కడ తెర వెనుక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డినే అజారుద్దీన్‌ను ప్రోత్సహిస్తున్నట్లుగా పార్టీవర్గాలే చెబుతున్నాయి. విష్ణు, ఆయన వర్గీయులు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి విష్ణువర్ధన్‌రెడ్డి ఆయనను కలిసిన సందర్భం లేదు. పైగా గతంలో కోమటిరెడ్డి వర్సెస్ రేవంత్ ఎపిసోడ్లో మొదటి నుంచి పార్టీలో ఉన్న వారిని రేవంత్ హోంగార్డుల పోల్చినప్పుడు పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో విష్ణువర్ధన్‌రెడ్డి, కోమటిరెడ్డికి మద్దతుగా నిలిచి.. మేం హోంగార్డులమే, మాతో ఏం పని? అని కూడా ప్రశ్నించారు. దీంతో అప్పటి నుంచి రేవంత్, విష్ణు మధ్య పెద్ద సత్సంబంధాలేమీ లేవు. అందుకే రేవంత్ జూబ్లీహిల్స్ నుంచి అజారుద్దీన్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చేలా పావులు కదుపుతున్నాడనే ప్రచారం జరుగుతోంది.
పీజేఆర్.. గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ మూడు అక్షరాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎంతో అభిమానం. అంతేకాదు.. తెలంగాణవాదిగానూ పీజేఆర్ అంటే రాష్ట్రంలో అభిమానించే వారి సంఖ్యకు తక్కువేమీ లేదు. రాజకీయ ప్రస్థానం ఆరంభించింది మొదలు.. ఎన్ని కష్టాలు ఎదురైనా.! సొంత పార్టీ ముఖ్యమంత్రి స్వయంగా టార్గెట్ చేసినా!! వెరవని… కాంగ్రెస్ జెండాను విడవని నాయకుడు పీజేఆర్. అలాంటి నాయకుడి వారసులకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి.
వాళ్లూ.. వీళ్లూ కాదు.. ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పీజేఆర్ వారసులకు చెక్ పెట్టేందుకు తెర వెనుక పావులు కదుపుతున్నాడనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు సైతం ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లో పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి.. ఖైరతాబాద్‌లో ఆయన కుమార్తె విజయారెడ్డికి టికెట్ రాకుండా రేవంత్ చెక్ పెడుతున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో ‘ముందొచ్చిన చెవుల కంటే… వెనకొచ్చిన కొమ్ములు వాడి’ అన్నట్లుగా తయారైంది పరిస్థితి అని కాంగ్రెస్ నాయకులే పెదవి విరుస్తున్నారు.
-సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ):
ఖైరతాబాద్‌లోనూ పీజేఆర్ వారసురాలికి వ్యతిరేకంగా…
పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని నమ్ముకుని ఉన్నారు. ఈమె గతంలో బీఆర్ఎస్లో ఉండి, కార్పొరేటర్‌గా గెలుపొందినప్పటికీ కొంతకాలం కిందట కాంగ్రెస్‌లోకి వెళ్లింది. ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్లడం వెనక కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రోత్సాహం ఉన్నట్లుగా తెలిసింది. దీంతో ఇక్కడ కూడా రేవంత్ తన అనుచరుడు రోహిణ్‌రెడ్డికి అనుకూలంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా.. రోహిణ్‌రెడ్డి అయితేనే ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ గెలుస్తుందనే రీతిలో సర్వేలు చేయిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 నియోజకవర్గాల్లో రేవంత్ తాను అనుకున్న వారికి అనుకూలంగా సర్వేలు చేయించి, అధిష్ఠానానికి పంపినట్లుగా తెలుస్తున్నది. అందులో ఖైరతాబాద్ నియోజకవర్గం కూడా ఉండగా.. విజయారెడ్డికి వ్యతిరేకంగా రోహిణ్‌రెడ్డిని రేవంత్ ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా పీజేఆర్ వారసురాలికి రేవంత్ చెక్ పెడుతున్నారు. మరోవైపు ఉదయపూర్ తీర్మానం మేరకు కుటుంబంలో ఒక్కరికే టికెట్ అన్న ప్రస్తావనను కూడా విష్ణు, విజయారెడ్డి విషయంలో వాడుతున్న రేవంత్.. చివరకు ఇద్దరికీ చెక్ పెట్టేలా ప్రయత్నిస్తున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.