బంజారాహిల్స్,ఆగస్టు 9 : మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా తయారైంది జూబ్లీహిల్స్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. నియోజకవర్గ కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిన మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గంతో సంబంధం లేకుండా వ్యవహరించారు. దీంతో కాంగ్రెస్‌కు చెందిన కీలక నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. విష్ణువర్ధన్ రెడ్డికి మరోసారి టికెట్ ఇస్తే ఓటమి ఖాయమంటూ నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక నాయకులు ఇటీవల పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో సహా కీలక నేతలకు ఫిర్యాదు చేశారు. కంగుతిన్న పార్టీ నాయకత్వం మరో అభ్యర్థి కోసం వేట ప్రారంభించింది. ఇందులో భాగంగా మాజీ ఎంపీ అజారుద్దీన్‌ను జూబ్లీహిల్స్ బరిలో దింపాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మాజీ కార్పొరేటర్ తనయుడు, పార్టీ సీనియర్ నేత భవానీశంకర్ ఆహ్వానం మేరకు అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాయి పే చర్చా కార్యక్రమానికి వచ్చారు. ఎల్లారెడ్డిగూడ, రహ్మత్ నగర్ ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.
అయితే, అజారుద్దీన్ పర్యటనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న మాజీ ఎమ్మెల్యే విష్ణు ఆదేశాల మేరకు ఆయన వర్గీయులు అజారుద్దీన్‌ను అడ్డుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకోవడంతో పాటు అతడి వెంట వచ్చిన కార్యకర్తలపై దాడికి దిగారు. ఆయనను ఆహ్వానించిన భవానీ శంకర్‌పై దాడి చేయడంతో అజారుద్దీన్ తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని వెళ్లారు. ఇదిలా ఉండగా.. రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలో తనకు టికెట్ రాకుండా చేసేందుకు రేవంత్ తెరవెనుక ఉండి అజారుద్దీన్‌ను రంగంలోకి తీసుకువచ్చారని విష్ణు వర్గీయులు మండిపడుతున్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. పార్టీ నాయకులు తాజా పరిణామాలతో నిలువున చీలిపోయిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, కుటుంబంలో ఒక్కరికే టికెట్ అనే నిబంధన ఉండటంతో జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు అంశంపై ఇప్పటికే వివాదం కొనసాగుతోంది. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.