మేడ్చల్ జోన్ బృందం, జనవరి 8 : అయోధ్య రామయ్య అక్షింతల పంపిణీ కార్యక్రమం.. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ నినాదాలతో ర్యాలీలు, కలశ శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు భక్తి శ్రద్ధలతో మంగళహారతులు పట్టారు.
మేడ్చల్ పట్టణం, మేడ్చల్ మండలంలోని ఎల్లంపేట, ఘట్కేసర్ మండల పరిధిలోని చౌదరిగూడ విజయపురి కాలనీ, పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో, నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలు, కీసర మండలం కేంద్రంలో, శామీర్‌పేట మండలం అలియాబాద్ గ్రామంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు అక్షింతలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, కౌన్సిలర్ సురేఖ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు జగన్ గౌడ్ పాల్గొన్నారు.
చర్లపల్లి : శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కుషాయిగూడ ఆధ్వర్యంలో భవానీనగర్, కుషాయిగూడ, చర్లపల్లి, ఏఎస్‌రావునగర్, కాప్రా డివిజన్, తదితర ప్రాంతాల్లో అయోధ్య శ్రీరాముడి అక్షింతలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రతినిధులు ప్రభాకర్, శ్రీధర్, సంపత్, మురళీపంతులు, చలపతి, సుమంత్, విజయ్, సాకేత్గౌడ్లతో పాటు కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
కాప్రా : కాప్రా డివిజన్ శ్రీశ్రీనివాస ఆఫీసర్స్‌కాలనీలో అయోధ్య శ్రీరాముడి అక్షింతలను కాలనీలో గడప, గడపకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇందిర, కుసుమ కుమారితో పాటు కాలనీ అధ్యక్ష కార్యదర్శులు చంద్రమౌళీశ్వరరావు, భాస్కర్‌రెడ్డి, ఠాగూర్, శంకర్రావు, ఇంద్రారెడ్డి, పాల్గొన్నారు.