ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 22: ఇటీవలే విడుదలైన సివిల్ సర్వీసెస్(Civil Services) ఫలితాల్లో ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) నుంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను వీసీ ప్రొఫెసర్ రవీందర్ సోమవారం ఘనంగా సన్మానించారు. సివిల్స్‌లో 82వ ర్యాంకు సాధించిన కౌశిక్, 545వ ర్యాంకు సాధించిన నరేంద్ర, సివిల్ సర్వీసెస్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ కొండ నాగేశ్వర్‌తో కలిసి వీసీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ రవీందర్ మాట్లాడుతూ.. ఓయూ విద్యార్థులు సివిల్స్‌లో విజయం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఉత్తమమైన లక్ష్యం కోసం సివిల్స్ సాధించిన వారు తప్పనిసరిగా సామాజిక అభివృద్ధిలో, ప్రత్యేకించి ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. రానున్న కాలంలో సివిల్స్‌లో ఓయూ విద్యార్థులు మరింత మంది విజయం సాధించాలని ఆకాంక్షించారు.