హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు అల్లాడి పోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలో ఈ దుస్థితి మరింతగా నెలకొన్నది. సీఎన్జీ గ్యాస్ కోసం బుధవారం అంబర్పేటలో మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లో వేచి ఉండటం పరిస్థితికి అద్దం పడుతున్నది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక బంకులు మూతపడ్డాయి. ఎక్కడ చూసినా బంకుల ముందు నోస్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. కాగా, హైదరాబాద్ నగరంలో వాహన ఎల్పీజీ గ్యాస్ ధరలు ఇష్టానుసారంగా పెంచుతున్నారని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ఎల్పీజీ ధర రూ.63 ఉండగా, ఇప్పుడు రూ.90 దాటిందని వాపోతున్నారు.
ఆయిల్ కంపెనీలు ఇంధన సరఫరా చేయడం లేదని ఎల్పీజీ, సీఎన్జీ బంక్ల వద్ద నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారని వాపోయారు. సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, అమీర్పేట్, సనత్నగర్, ఎల్బీనగర్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లోని బంక్ల వద్ద ఆటోలు ఎల్పీజీ, సీఎన్జీ కోసం భారీగా క్యూ కట్టాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 460కి పైగా పెట్రోల్ బంకులు ఉండగా, అందులో 95 స్టేషన్లలో గ్యాస్ పంపులు అందుబాటులో ఉన్నాయి. మరో 35 కేంద్రాల్లో నేచురల్ గ్యాస్ కేంద్రాలు కొనసాగుతున్నాయి.