సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డు పాలయ్యాయని తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్స్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ మహాధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా బీఆర్టీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు గిరాకీ లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే సంబంధిత రవాణా శాఖ మంత్రి చోద్యం చూస్తున్నారని విమర్శించారు.
ఆత్మహత్యలు చేసుకున్న డ్రైవర్ల కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చిన సర్కార్ ఇప్పుడు మౌనం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఏఐటీయూసీ వెంకటేశం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 మోటారు వాహనాల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఫైనాన్షియర్ల దోపిడీని అరికట్టాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ శ్రీకాంత్, టీయూసీఐ ప్రవీణ్, ఆటోయూనియన్ నాయకులు సలీంభాయ్, సత్తిరెడ్డి, గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు.