సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వాహన సంఘాలు ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు ఆటో యూనియన్ సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు శనివారం ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఆటో యూనియన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణలో ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
కాంగ్రెస్ ఇచ్చిన హమీ ప్రకారం ప్రతి ఆటో డ్రైవర్‌కు నెలకు రూ. 12వేలు చెల్లించాలని కోరారు. ప్రభు త్వం స్పందించకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామన్నారు. మా ఆత్మహత్యలు కనిపించడం లేదా? సీఎం రేవంత్ రెడ్డి నీ వైఖరి మార్చుకోవాలంటూ హెచ్చరించారు. ఎలక్ట్రిక్ ఆటోలను ఆర్టీసీకి అనుసంధానించొద్దని డిమాండ్ చేశారు. ఓలా, ర్యాపిడో, ఉబర్ తదితర యాప్‌లను రద్దు చేసి ప్రభుత్వమే డ్రైవర్ల కోసం ఒక యాప్ తీసుకురావాలని కోరారు. కమీషన్ల పేరుతో వాహన ఆధారిత యాప్‌లు డ్రైవర్ల శ్రమను దోచుకుంటున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆటో జేఏసీ నాయకులు పెంటయ్యగౌడ్, మారయ్య, సత్తిరెడ్డి, రవి శంకర్,శ్రీధర్ రెడ్డి, ఈశ్వర్, శ్రీనివాస్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.