సిటీబ్యూరో: నగరంలో ఆటో డ్రైవర్లకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. కేవలం రెండు బంక్‌ల్లోనే గ్యాస్, సీఎన్జీ అందుబాటులో ఉందని ఆటో డ్రైవర్లు వాపోయారు. ఓ వైపు ప్రభుత్వం గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని డాంభీకాలు పలుకుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం గ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తున్నది. నగరంలో ఆటోలు నడిపే పరిస్థితి లేదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం నగరంలో ఎల్పీజీ, సీఎన్జీ బంక్‌లు అధిక భాగం మూసీ ఉండటంతో ఆటో డ్రైవర్లు తెరిచిన బంక్‌ల ముందర కిలో మీటర్ల క్యూలో ఉండాల్సి వచ్చింది. లక్డీకాపూల్ నుంచి ఖైరతాబాద్ బడా గణేశ్ వరకు ఆటోలు క్యూలో ఉండటం పరిస్థితికి అద్దం పడుతున్నది. అదీ కూడా చాలా మందికి ఇంధనం లభించకపోవడంతో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గరీబోళ్లను మరింత గరీబులగా మారుస్తున్నారని హబీబ్ అనే ఆటో డ్రైవర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.