దుండిగల్, జూలై11: పార్టీ ఆఫీసుకు ఇల్లు తీసుకొని.. అద్దె చెల్లించకుండా..తిష్టవేసి..ఇంటి ఆక్రమణకు యత్నించాడో ఓ కాంగ్రెస్ నేత. కిరాయి చెల్లించకుండా.. ఇబ్బందిపెడుతుండంతో ఆగ్రహించిన ఇంటి యజమాని పలువురు అనుచరులతో కలిసి ఇంట్లోని సామాన్లు బలవంతంగా బయటవేశాడు. సూరారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సూరారం కాలనీ, సాయిబాబానగర్ చౌరస్తాలో కాలనీకి చెందిన ఉంగరాల రాజు అనే వ్యక్తికి ఇల్లు ఉంది. రెండున్నరేండ్ల కిందట కాంగ్రెస్ పార్టీ డివిజన్ కార్యాలయం కోసం ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ సాయిబాబానగర్ డివిజన్ అధ్యక్షుడు హరికిరణ్ పటేల్ కిరాయికి తీసుకున్నాడు.
ఇందుకు సంబంధించి ఇరువురు అగ్రిమెంట్ పత్రాలు సైతం రాసుకున్నారు. ఆరునెలల కిందట వరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగానే ఉన్న ఇంట్లో ఉన్నట్టుండి డివిజన్ కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ప్రెసిడెంట్ సోమన్నగారి శ్రీధర్‌రెడ్డి కుటుంబంతో సహా ఉంటున్నాడు. అప్పటి నుంచి ఇంటి యజమానికి కిరాయి ఇవ్వకపోవడంతో ఇల్లుఖాళీ చేయాలని పలుమార్లు ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకపోవడంతో విసిగిపోయిన ఇంటి యజమాని పలువురు వ్యక్తులతో కలిసి శనివారం ఉదయం బలవంతంగా ఇంట్లోని సామాన్లు బయట వేయించాడు. దీంతో శ్రీధర్‌రెడ్డి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, పోలీసులు ఉంగరాల రాజుతో పాటు అతడికి సహకరించిన పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో సదరు కాంగ్రెస్ నేత తరపున ఇద్దరు బడా కాంగ్రెస్ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తున్నది.