బంజారాహిల్స్, డిసెంబర్ 15: బంజారాహిల్స్ రోడ్ నం. 13(ఏ)లోని అంబేద్కర్‌నగర్ బస్తీలో కమ్యూనిటీహాల్ కోసం కేటాయించిన స్థలం ఆక్రమణకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బస్తీవాసులు షేక్‌పేట మండల తహసీల్దార్ అనితారెడ్డికి ఫిర్యాదు చేశారు. మూడురోజులుగా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు బస్తీలోని స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సుమారు 30ఏళ్ల కిందట ఈ స్థలాన్ని తాము కొన్నామంటూ బస్తీవాసులపై దౌర్జన్యం చేస్తున్నారు. ప్రభుత్వంలోని ఓ మహిళా మంత్రి పీఏ పేరు చెబుతూ స్థలంలోని ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు తొలగించేందుకు సోమవారం మరోసారి ప్రయత్నించారు. బోర్డులపై నల్లరంగును పూశారు.
ఈ వ్యవహారంపై స్థానికులు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ్‌నగర్ ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నారని, తమకు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయంటూ బస్తీవాసులను దబాయించడంతో పాటు ఏకంగా ప్రభుత్వంలోని మంత్రి పీఏ పేరు చెప్పడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వెంటనే రెవెన్యూ అధికారులు స్పందించి స్థలాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని, కబ్జాకు యత్నిస్తున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.