సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): శివార్లలో గంజాయి బ్యాచ్‌లు హల్చల్ చేస్తున్నాయి. మద్యానికితోడు గంజాయి కూడా సేవిస్తూ రోడ్లపైనే స్వైరవిహారం చేస్తున్నారు. ఏపీ, ఒడిశా రాష్ర్టాల నుంచి గంజాయి హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ర్టాలకు రవాణా కాకుండా అప్పుడప్పుడు అడ్డుకుంటున్న పోలీసులు… స్థానికంగా గంజాయి లభ్యతపై అంతగా దృష్టి పెట్టడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని ధూల్‌పేట్ వంటి ప్రాంతాల్లో గంజాయి దొరకకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా కట్టడి చేశారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇలాంటి ప్రాంతాలపై దృష్టి సారించడం లేదు. శివార్లలో పెద్ద మొత్తంలో గంజాయి డంప్ చేసి.. అక్కడి నుంచే తక్కువ మొతాదుల్లో నగరంలోపలికి, శివార్లలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. శివార్లలో జరిగే పార్టీలు, చిన్న చిన్న అడ్డాల్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నా పోలీసులు గుర్తించలేకపోతున్నారని వివమర్శలు వస్తున్నాయి.
స్నేహితులతో ఫ్యాషన్‌గా మొదలు పెట్టి కొందరు ఈ గంజాయికి బానిసవుతున్నారు. మద్యం, గంజాయి మత్తులో విచక్షణరహితంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కొత్తపేట ప్రాంతంలోని వీఎం హోం మెట్రో పిల్లర్ వద్ద ఏపీ కి వెళ్తున్న ఎస్వీటీ ట్రావెల్ బస్సుకు అడ్డంగా గంజాయి మత్తులో కొందరు కారును అడ్డుపెట్టి.. డ్రైవర్‌పై దాడికి పాల్పడి.. బస్సు అద్దాలు పగులగొట్టి హంగామా చేశారు. పోలీసులు చేరుకునే సరికి వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఇటీవల జగద్గిరిగుట్ట ప్రాంతంలో పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన రౌడీషీటర్ హత్యకేసులో మరో రౌడీషీటర్ గంజాయి మత్తులో విచక్షణ రహితంగా పొడుస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాడు. అలాగే.. ఎల్బీనగర్ ప్రాంతంలో ఆకతాయిలు గంజాయి మత్తులో తరచూ న్యూసెన్స్ చేస్తుంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఎల్బీనగర్ నుంచి కామినేని వెళ్తున్న రూట్లో ఒక హోటల్ వెనుక ఉన్న ఖాళీ ప్రాంతంలో సాయంత్రం అయ్యిందంటే గంజాయి బ్యాచ్ హంగామా చేస్తుంటుందని స్థానికులు చెబుతున్నారు. చంగిచర్ల ప్రాంతంలోని ఓ హోటల్ వద్దకు వివిధ ప్రాంతాల నుంచి యువకులు వచ్చి గంజాయి తాగడంతోపాటు అమ్ముతుంటారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలా పలు చోట్ల యువకులకు అడ్డాలు ఉన్నాయని, అక్కడ నిఘా పెడితే పోలీసులకు గంజాయి విక్రయించే బ్యాచ్‌లు పట్టుబడుతాయని ప్రజలు సూచిస్తున్నారు. పెట్రోలింగ్ వ్యవస్థలు పటిష్టంగా పనిచేస్తే గల్లీల్లో ఉండే ఆకతాయి బ్యాచ్‌లు, గంజాయి అడ్డాల్లో భయం నెలకొని గంజాయికి యువత దూరంగా ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు.