సిటీబ్యూరో, జనవరి 7(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో మరోసారి పోలీసుల నిఘా వైఫల్యం బయటపడింది. కాంగ్రెస్ శ్రేణులు బీజేపీపై దాడి చేయడాన్ని పోలీసులు ముందుగా ఎందుకు గుర్తించలేదనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఆందోళన జరుగుతుందని పోలీసులకు తెలిసినా దాడిని ఆపలేని పరిస్థితిలో ఉండటం గమనార్హం. ఏడాది కాలంగా చాలాసార్లు పోలీసుల నిఘా వైఫల్యం బయటపడింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, అదే క్రమంలో నేడు కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాలపై దాడుల విషయంలోనూ పోలీసులు ఫెయిల్ అయ్యారనే విమర్శలు వస్తున్నాయి.
కాంగ్రెస్ శ్రేణులు తాము ధర్నా చేస్తామంటూ పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారని, అయితే పోలీసుల కండ్లు కప్పి బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకొని దాడి చేశారని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎంపీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలైన ప్రియాంకపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేస్తామంటూ కాంగ్రెస్ శ్రేణులు పోలీసుల వద్ద అనుమతి అడిగినా ముందు చూపుతో పోలీసులు వ్యవహరించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్, బీజేపీ కార్యాలయం నాంపల్లిలో సమీపంలోనే ఉంటాయి.
అలాంటిది పోలీసులు కనీసం దాడి జరిగే అవకాశాలను పసిగట్టకపోవడం.. పోలీసుల నిఘా దిగజారిపోవడం ఆందోళన కలిస్తున్నది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గాంధీ భవన్ ముందే బీజేపీకి వ్యతిరేకంగా శాంతియుత పద్ధతిలో ధర్నా చేసి నిరసన వ్యక్తం చేస్తామని అనుమతి తీసుకున్నారని నగర పోలీసు అదనపు కమిషనర్ విక్రమ్‌సింగ్ మాన్ వెల్లడించారు. అయితే ఊహించని విధంగా యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ ప్రధాన కార్యాలయం వైపు వేర్వేరుగా అక్కడకు చేరుకున్నారని తెలిపారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.