బంజారాహిల్స్,ఆగస్టు 15: స్థలాన్ని కొనుగోలు చేసేందుకు వెళ్లిన వ్యక్తులపై ఇంటి యజమానులు దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని నందినగర్‌లో రాందాస్ కుటుంబానికి సుమారు 400గజాల స్థలం ఉంది. దాంట్లో ఎన్నో ఏండ్లుగా రేకుల ఇండ్లు ఉన్నాయి. కాగా గత కొంతకాలంగా కుబేరుడు అనే వ్యక్తి ఈ స్థలంలో కొంతభాగం తనదంటూ పత్రాలు చూపిస్తూ వాదిస్తున్నాడు.
నందినగర్ బస్తీ ఏర్పాటు నుంచి ఈ స్థలం తమదేనంటూ పలుమార్లు రాందాస్ తదితరులు చెప్పినా పట్టించుకోవడం లేదు. కాగా ఈ స్థలంలో 200 గజాల స్థలం విక్రయిస్తున్నామంటూ చెప్పడంతో నరేష్ రెడ్డి అనే మద్యవర్తి కవాడిగూడకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు నారకంటి కవిత శనివారం స్థలాన్ని చూడేందుకు వచ్చారు. దాంతో ఈ స్థలం తమదని, దీన్ని అమ్మడం లేదంటూ స్థలం యజమాని రాందాస్‌తో పాటు బంధువులు వాగ్వాదానికి దిగారు.
ఎంతోమంది రోజూ వచ్చి స్థలాన్ని చూస్తున్నారని. బోగస్ పత్రాలతో స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారంటూ రాందాస్‌తో పాటు పలువురు స్థానికులు స్థలాన్ని చూసేందుకు వచ్చిన కవితపై దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో తన సెల్‌ఫోన్ పగిలిపోవడంతో పాటు బంగారు గొలుసు మాయమయిందంటూ బాధితురాలు కవిత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడు రాందాస్, పద్మ,శోభ, చంద్రకళ తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.