ఎల్బీనగర్, డిసెంబర్ 9 : చేసిన పనికి డబ్బులు ఇవ్వాలని కోరిన సబ్ కాంట్రాక్టర్‌పై ఆర్కేపురం కార్పొరేటర్ భర్త ధీరజ్‌రెడ్డి దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో ఆర్కేపురం కార్పొరేటర్ భర్త ధీరజ్‌రెడ్డి వద్ద పెద్దపల్లికి చెందిన దాసరి హనుమయ్య సబ్ కాంట్రాక్ట్ పనులు చేశాడు. అయితే బిల్లుల చెల్లింపు విషయంలో ఇరువురి మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో శనివారం రాత్రి డబ్బుల విషయం మాట్లాడేందుకు స్నేహితులు భాస్కర్, దాసరి కిషన్, కడెం, ఆముదాల నర్సయ్య, వల్లపు మంగితో కలిసి హనుమ య్య ఆర్కేపురంలోని ధీరజ్‌రెడ్డి కార్యాలయానికి వెళ్లాడు. తనకు కాంటాక్ట్ చేసిన పనులకు సంబంధించి రూ.34లక్షలు రా వాలని కోరగా.. లేదు రూ. 16 లక్షలు మాత్రమే ఇ వ్వాల్సి ఉందని ధీరజ్‌రెడ్డి వాధించాడు.
ఈ విషయంలో ఇరువురి మధ్య వివాదం నెలకొనడంతో ధీరజ్‌రెడ్డి.. తన అనుచరులతో కలిసి హనుమయ్యపై దాడికి పాల్పడటంతోపాటు హనుమయ్య వెంట వచ్చిన భాస్కర్ అనే వ్యక్తి ని కులం పేరుతో దూషించాడు. బాధితుడి కుమార్తె దాసరి ఉష ఆధ్వర్యంలో పలువురు పోలీస్‌స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి..వెంటనే ధీరజ్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని కోరారు. అనంతరం బాధితులు చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ధీరజ్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకుని ఏసీపీ కార్యాలయానికి తరలించారు. అలాగే.. బీజేపీ నాయకులు కూడా హనుమయ్య, అతని అనుచరులు తమపై దాడిచేయడంతోపాటు ప్రవీణ్ అనే వ్యక్తిని కులంపేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఈ మేరకు పోలీసులు ఇరువురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. దాసరి హనుమయ్యపై దాడి విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్.. ఎల్బీనగర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడిని పరామర్శించారు.