సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): మద్యం తాగి వాహనం నడపడమే కాక.. సైడ్ ఇవ్వలేదన్న సాకుతో ఓ సీనియర్ జర్నలిస్ట్‌పై ఇద్దరు దాడి చేశారు. ఇష్టారీతిన మొహంపై పిడిగుద్దులు గుద్ది పారిపోయారు. బోయిన్‌పల్లిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగితే.. బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. వెలుగు దినపత్రికలో స్పోర్ట్స్ ఇన్చార్జ్గా విధులు నిర్వర్తిస్తున్న కృష్ణారెడ్డి శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో.. కంటోన్మెంట్ బీజేపీ నేత భానుక నర్మదా మల్లికార్జున్ కుమారుడు సూరజ్, అతడి స్నేహితుడు మద్యం తాగి కారులో వేగంగా వస్తున్నారు.
బోయినపల్లి సెంటర్ పాయింట్ వద్దకు చేరుకోగానే కారుకు సైడ్ ఇవ్వలేదన్న సాకుతో కృష్ణారెడ్డిపై పిడిగుద్దులు కురిపిస్తూ దాడి చేశారు. ఇదే విషయమై శనివారం ఉదయం 11 గంటలకు బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్‌లో కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే, నిందితులను పోలీస్‌స్టేషన్‌కు పిలిచి మాట్లాడాల్సిన పోలీసులు.. వారికి రాజకీయ నేపథ్యం ఉండటంతో కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. కాగా, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టు(హెచ్‌యూజే- టీడబ్ల్యూజేఎఫ్) సోమవారం ఈ దాడిని ఖండించింది. ఇకనైనా పోలీసులు స్పందించి నిందితులపై కేసులు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని హెచ్‌యూజే అధ్యక్షుడు అరుణ్‌కుమార్, కార్యదర్శి జగదీశ్వర్ డిమాండ్ చేశారు.