కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 19 : జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రొనాల్డ్ రోస్.. నగరంలో వందశాతం స్వచ్ఛతను సాధించడంపై ప్రత్యేక దృష్టినిసారించారు. పదిరోజుల క్రితం కూకట్పల్లి జోన్ పరిధిలోని పలు సర్కిళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి.. పారిశుధ్య నిర్వహణపై ఆరా తీశారు. కాలనీలు, బస్తీలలో ఇంటినుంచి చెత్త సేకరణ, సేకరించిన వ్యర్థాల తరలింపు, పారిశుధ్య కార్మికుల పనితీరు, ప్రజల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులపై క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో చెత్తకుప్పలు కనిపించడంతో ఆ చెత్తకుప్పలు ఉండడానికి కారణాలేంటని ఆరా తీస్తూ.. తరచుగా చెత్త వేస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టినిసారించాలని.. క్రమక్రమంగా ఆ ప్రాంతాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి స్వచ్ఛ ఆటోను పంపించాలని ప్రజలకు అవగాహన కల్పించి స్వచ్ఛ ఆటోలోనే చెత్తను వేసేలా చేయాలని.. ఆ చెత్తను ఎప్పటికప్పుడు తరలించేలా కార్యచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. దీనిలో భాగంగా కూకట్పల్లి జంట సర్కిళ్ల పరిధిలో తరచుగా చెత్త వేస్తున్న ప్రాంతాలు (జీవీపీ)ల తొలగింపుపై అధికారులు ప్రత్యేక దృష్టినిసారించారు.
జంట సర్కిళ్లలో 213 జీవీపీలు..
కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో తరచుగా చెత్తవేసే ప్రాంతాలు (జీవీపీ)లు 213 ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. కూకట్పల్లి సర్కిల్లో 83 జీవీపీలు, మూసాపేట సర్కిల్ 130 జీవీపీలు ఉన్నాయి. ఈ జీవీపీలన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పూర్తిగా తొలగించేందుకు ప్రత్యేక కార్యచరణను రూపొందించారు. ఆ ప్రాంతంలో తరచుగా చెత్త వేయడానికి కారణాలను గుర్తిస్తూ ఆ ప్రాంతంలో చెత్త వేస్తున్న వారిని గుర్తిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. సమీపంగా ఉండే కాలనీలు, బస్తీలు, అపార్టుమెంట్లు, హోటళ్లు, చిరు వ్యాపారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛ ఆటోను పంపించడం, తడి పొడి చెత్తను వేరుచేసి ఆటోలోనే వేయాలని కోరుతున్నారు. పదిరోజుల కార్యచరణలో ఇప్పటికే కూకట్పల్లి సర్కిల్లో 11, మూసాపేట సర్కిల్లో 12 కలిపి జంట సర్కిళ్లలో 23 జీవీపీలను తొలగించారు. ఇంకా మూసాపేట సర్కిల్లో 118 జీవీపీలు, కూకట్పల్లి సర్కిల్లో 72 జీవీపీలు ఉన్నాయి. వీటన్నింటినీ తొలగించి జీవీపీ రహితంగా మార్చేందుకు ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు.
వీధి వ్యాపారుల కోసం స్పెషల్ ఆటో..
జీవీపీలను తొలగించే దిశగా.. గుర్తించిన ప్రాంతాలలో ప్రత్యేక నిఘాను పెట్టాం. చెత్త వేస్తున్న వారిని గుర్తిస్తూ ఆ ప్రాంతంలో చెత్త వేయకుండా స్వచ్ఛ ఆటోలోనే వేసేలా చర్యలు తీసుకుంటున్నాం. కేపీహెచ్‌బీ కాలనీ రమ్యాగ్రౌండ్ వెనుకాల జీవీపీని తొలగించి మొక్కలు నాటుతున్నాం. కేపీహెచ్‌బీ కాలనీ సర్వీస్ రోడ్డులో వీధి వ్యాపారుల కోసం ప్రత్కేక ఆటోను ఏర్పాటు చేశాం. మీసేవ రోడ్డులో ప్రత్యేక ఆటోను అందుబాటులో ఉంచి చెత్తను రోడ్డుపైన వేయకుండా ఆటోలోనే వేసేలా అవగాహన కల్పించాం. ఉన్నతాధికారుల ఆదేశాలతో జీవీపీలను తొలగించే దిశగా ముందుకు సాగుతున్నాం.
– సాల్మాన్రాజ్, ఏఎంహెచ్‌వో, మూసాపేట సర్కిల్
ప్రజలు సహకరించాలి
వందశాతం స్వచ్ఛతను సాధించాలన్న లక్ష్యంతో జీవీపీలను తొలగించేందుకు చర్యలు చేపట్టాం. జీవీపీలు ఏర్పడడానికి కారణాలను గుర్తిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇంటింటికి స్వచ్ఛ ఆటో వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నాం. వారాంతపు సంతలు, వీధి వ్యాపారులు ఎక్కువగా ఉన్నచోట్ల ప్రత్యేక ఆటోను అందుబాటులో ఉంచాం. స్వచ్ఛ ఆటోలకు డబ్బులు ఇవ్వడానికి పేద ప్రజలు వెనుకంజ వేయడం వల్లే రోడ్ల పక్కన జీవీపీలు ఏర్పడుతున్నాయి. ప్రజలు, వెల్ఫేర్ అసోసియేషన్ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ సహకరించాలని కోరుతున్నాం.
– మమత, ఏఎంహెచ్‌వో, కూకట్పల్లి సర్కిల్