Khairatabad | ఖైరతాబాద్, ఏప్రిల్ 2 : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానంపై వేటు పడాలని నియోజకవర్గ కాంగ్రెస్ అసమ్మతి నేతలు వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్‌లో అసెంబ్లీ ఉప ఎన్నిక అనివార్యమైతే 30 ఏండ్లుగా నిరంతారయంగా కాంగ్రెస్‌లో ఉన్న రాజు యాదవ్‌కు టికెట్ కేటాయించాలంటూ ఇటీవల కేబీఆర్ పార్కు వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల పేరుతో ఓ భారీ ఫ్లెక్సీ వెలియడంతో ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపింది.
తాజాగా మళ్లీ అదే ఫ్లెక్సీ ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వద్ద బుధవారం వెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం వర్గంతో పాటు ముఖ్య నాయకులు, మాజీ కార్పొరేటర్ రాజు యాదవ్ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీని చూస్తే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి ఏ మేరకు ఉందో స్పష్టమవుతున్నది. ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని రకాల అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. పారిశుధ్యం లోపించింది.
తరచూ శాంతిభద్రతల సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే స్థానిక కార్పొరేటర్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కావడంతో డివిజన్‌ను గాలికి వదిలేయగా, కనీసం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పట్టించుకునేందుకు ఎమ్మెల్యే కూడా అందుబాటులో లేరని ప్రజలు వాపోతున్నారు. ఏడాది కాలంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్ని సార్లు నియోజకవర్గంలో పర్యటించారో వేళ్లపై లెక్కపెట్టి చెప్పవచ్చని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ పై వేటు పడాలని సొంత పార్టీ వారే బలంగా కోరుకోవడం విశేషం.