జవహర్‌నగర్, డిసెంబర్ 24: భూకబ్జాదారులు రెచ్చిపోయారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు వెళ్లిన రెవెన్యూ ఇన్స్పెక్టర్పై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధి, దేవేందర్‌నగర్‌లో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. కాప్రా తహసీల్దార్ సుచరిత ఆదేశాల మేరకు మంగళవారం జవహర్‌నగర్ కార్పొరేషన్, దేవేందర్‌నగర్‌లోని సర్వే నెం. 645, 646, 655 ప్రభుత్వ భూముల్లో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చివేసేందుకు రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పోలీసుల సహకారంతో మంగళవారం వెళ్లారు. కూల్చివేతలు చేపడుతుండగా ఒక్కసారిగా కబ్జాదారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేశ్‌పై దాడికి పాల్పడ్డారు. తాసీల్దార్ దేశాల మేరకు దాడికి పాల్పడిన ఇరుగదిండ్ల వెంకటేశ్, రాపొనోళ్ల రాజు, వడ్డెర శ్రీను, ముగ్గురు గుర్తు తెలియని మహిళలపై జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ప్రభుత్వ భూముల్లో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చివేసేందుకు వెళ్లిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేశ్‌పై కబ్జాదారుల దాడి హేయమైన చర్య అని కాప్రా తహసీల్దార్ సుచరిత అన్నారు. విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ అధికారిపై భూకబ్జాదారులు దాడిచేయడం దుర్మార్గమని, ఇలాంటి ఘటనపై ఊరుకునేదే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో రాజీపడేదే లేదని, ఎంతటివారినైనా వదిలిపెట్టమని ఆమె హెచ్చరించారు.