మారేడ్‌పల్లి, జనవరి 25: పాన్ మసాలా వ్యాపారిని నగరంలో కిడ్నాప్‌చేసి, ఖమ్మం జిల్లాలో హత్యకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిని కార్ఖానా పోలీసులు అరెస్టు చే యగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం… కార్ఖానా, విక్రమ్పురికి చెందిన బొల్లు రమేశ్ (51), జననీ భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. రమేశ్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో పాన్ మసాల వ్యాపారం చేస్తుంటాడు.
ఈ నెల 18న రమేశ్ ఆఫీసుకు వెళ్లి రాకపోవడంతో 19న అతని భార్య జననీ కార్ఖానా పోలీస్ స్టేషన్లో కీస్ అవెన్యూ కాలనీ, బం డ్లగూడ, చాంద్రాయగుట్ట ప్రాంతానికి చెందిన సయ్యద్ సజ్జాద్ అహ్మద్‌ఖాన్‌పై అనుమానం ఉందని ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. మరో ముగ్గురితో కలిసి రమేశ్‌ను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. వెంటనే నిందితుడు అహ్మద్ ఖాన్‌ను తీసుకొని ఖమ్మం జిల్లా, కూసుమంచిలో హత్యకు గురైన ఘటనా స్థలానికి తీసుకెళ్లి పరిశీలించారు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతుండడంతో స్థానిక ప్రభుత్వ వైద్యులను పిలిపించి ఘటనా స్థలంలో పోస్టుమార్టం నిర్వహించారు. శనివారం ప్రధాన నిందితుడు సయ్యద్ సజ్జాద్ అహ్మద్ ఖాన్‌ను రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు.
పాన్ మసాల వ్యాపారి బొల్లు రమేశ్ వద్దకు ఈ నెల 18న ప్రధాన నిందితుడు అహ్మద్‌ఖాన్‌తో పాటు ఒబైద్ మీర్జా, ఫర్వేజ్లతో పాటు మరో వ్యక్తి వెళ్లాడు. సూమారు రూ.6లక్షల పాన్ మసాల సరుకును కొనుగోలు చేశారు. రమేశ్వద్ద అధిక సంఖ్యలో డబ్బులు ఉన్నాయని గుర్తించిన నిందితులు… డబ్బు లు ఇస్తామని కాచిగూడకు రమ్మని చెప్పగా రమేశ్ అక్కడికి వెళ్లాడు. అక్కడ రమేశ్‌ను కారు లో ఎక్కించుకొని కాళ్లు, చేతులు కట్టేసి కిడ్నాప్ చేశారు.
రమేశ్ అకౌంట్ నుంచి రూ.15లక్షలను వారి అకౌంట్‌కు బదిలీ చేసుకున్నారు. అయితే.. రమేశ్‌ను వదిలివేస్తే తమ విషయం బయట పడుతుందనని ఈ నెల 19న ఉదయం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా కూసుమంచి మం డలం, లింగారు తండా సమీపంలోని మిర్చితోటలోకి తీసుకెళ్లిహత్యచేసి పారిపోయారు. అనంతరం మిర్చితోట యజమాని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించా రు. అదే సమయంలో కార్ఖానా పోలీసులు సైతం ప్రధాన నిందితుడిని తీసుకుని ఘట నా స్థలాన్ని పరిశీలించి.. హత్యకు గురైన వ్యక్తి రమేశ్ అని గుర్తించారు.