సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ ) : ఎంసీఆర్హెచ్ఆర్డీలో బుధవారం ఆషాఢ బోనాల ఉత్సవాలకు సంబంధించిన సమన్వయ సమావేశం జరిగింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, దానం నాగేందర్, డీజీపీ సీవీ ఆనంద్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ నగర సీపీ సజ్జనార్ వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. లండన్లో ఉన్న మంత్రి కొండా సురేఖ వర్చువల్గా సమావేశంలో పాల్గొన్నారు.
జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి జిల్లాల పరిధిలోని దేవాలయాల్లో నిర్వహించే బోనాల ఉత్సవాలకు సౌకర్యాల కల్పనలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టే గోలొండ జగదాంబ మహంకాళి దేవాలయంలో జూలై 16న ప్రారంభమయ్యే ఉత్సవాలు..ఆగస్టు 13 వరకు అట్టహాసంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించినట్లు మంత్రి పొన్నం తెలిపారు.