మెహిదీపట్నం, జూన్ 25 : ఆషాఢ మాసం బోనాలు నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే తొలి బోనంతో బోనాల సందడి ప్రారంభమవుతుంది. ముందుగా లంగర్ హౌస్ చౌరస్తాలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ప్రభుత్వం తరఫున శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి అధికారికంగా బోనాలను ప్రారంభిస్తారు.
లంగర్ హౌస్ చౌరస్తాలో అమ్మవారికి పట్టు వస్ర్తాలను ప్రభుత్వం తరఫున సమర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి పోతరాజుల ఊరేగింపులు, నృత్యాలతో తొట్టెల ఊరేగింపు ఉంటుంది. గోల్కొండలోని పూజారి ఇంటి వద్ద ఉత్సవ విగ్రహాలకు ఆభరణాలతో అలంకరించి.. గోల్కొండ కోటపై ఉన్న అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపు తీసుకెళ్తారు. అక్కడ బోనం, తొట్టెల సమర్పణతో తొలి బోనం పూజ ముగుస్తుంది. అమావాస్యను పురస్కరించుకొని బుధవారం గోల్కొండ కోట మెట్లకు మహిళలు బొట్లతో పూజలను నిర్వహించారు. ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమయ్యే ముందు వచ్చే అమావాస్య రోజు గోల్కొండ కోటలో మెట్లకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.