Jala Mandali | సిటీబ్యూరో, జనవరి 15(నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరంలో రోడ్లు ఖాళీగా ఉండటంతో ఈ అవకాశాన్ని జలమండలి అధికారులు తాగు, మురుగునీటి పైపులైన్ మరమ్మతులు చేపట్టి సద్వినియోగం చేశారు. సాధారణ రోజుల్లో ఈ పనులు నిర్వహిస్తే ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉండటంతో పండుగ సమయాన్ని సమస్యల పరిష్కారానికి కేటాయించి వేగంగా పనులు పూర్తి చేశారు.
మూసాపేట రోడ్ క్రాసింగ్ పనులు, కేపీహెచ్‌బీ ఫోరం మాల్ సర్కిల్ దగ్గర సీవరేజీ పైపులైన్, మూసాపేటలోని అంజనేయ నగర్లో సీవరేజీ, బంజారాహిల్స్ రోడ్ నం. 10 పైపులైన్ లీకేజీ, జగద్గిరిగుట్టలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఏర్పడ్డ లీకేజీని అరికట్టారు. ప్రగతినగర్‌లో నీటి సరఫరా పెంచడానికి గ్యాప్ క్లోజర్ పనులు నిర్వహించారు. పంజాగుట్ట క్రాస్‌రోడ్స్‌లో సీవరేజీ పైపులైన్ డ్యామేజ్ కావడంతో దానికి మరమ్మతులు నిర్వహించారు. ఈ పనులన్నింటిని సంబంధిత సర్కిళ్ల జీఎంలు, సెక్షన్ మేనేజర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందిని, అధికారులను ఎండీ అశోక్‌రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ అభినందించారు.