సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): టెక్నాలజీ పెరిగింది.. ఏ స్థాయిలో వర్షం వస్తుందనే విషయం ముందే తెలుస్తుంది. కాని నగరంలోని ప్రభుత్వ యంత్రాంగం మాత్రం వర్షం వస్తే మాకేంటి.. వర్షం వచ్చిన తరువాత తాపీగా వెళ్లి రోడ్లపై అలా తిరిగి ఫొటోలు దిగి వస్తే సరిపోతుందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పోలీస్, జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, హైడ్రా, జలమండలి, విద్యుత్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ సమస్య రాకుండా చేయడంలో తమ వంతు పాత్ర పోషించాలి. కాని ఎవరికీ వారే మాకెందుకులే అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు.
బుధవారం రాత్రి భారీ వర్షం పడింది, ఈ విషయం ముందుగానే అధికార యంత్రాంగానికి తెలిసినా ఏ ఒక్కరు కూడా రోడ్లపైకి రాలేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. రోడ్లపైకి వచ్చి నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి ఉండడం, వాహనదారులకు నీళ్లు నిలిచిన చోట సూచనలు చేసే విధంగా ప్రణాళికలు చేసుకొని ఉంటే కనీసం బుధవారం రాత్రి ఒక ప్రాణం పోకుండా అధికారులు కాపాడేందుకు అవకాశముండేది. రోడ్లన్నీ చీకటిమయం..!
వర్షానికి విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో రోడ్లన్నీ చీకటి మయంగా మారుతున్నాయి. రోడ్లపై నీళ్లు నిలిచపోవడంతో గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులు ఏదో విధంగా అక్కడి నుంచి బయటపడుదామనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. అప్పటికే ఆ ప్రాంతంలో చీకటి కూడా అలుముకోవడంతో వాహనదారులు అక్కడి నిలిచిన నీటిన అంచనా వేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు.