Security Mock Drills | హైదరాబాద్ : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రేపు సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ (Security Mock Drills) నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది.
కేంద్రం ఆదేశాలతో తెలుగు రాష్ట్రాలతోపాటు రేపు మొత్తం 259 చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. ఇక హైదరాబాద్ (Hyderabad)లో మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. కంచన్బాగ్ డీఆర్డీవో, మౌలాలి ఎన్ఎఫ్సీ, సికింద్రాబాద్, గోల్కొండ ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఆపరేషన్ అభ్యాస్( Operation Abhyaas ) పేరుతో డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నగరమంతా సాయంత్రం 4 గంటలకు సైరన్ల మోత మోగనుంది. సైరన్ మోత వినిపించగానే బహిరంగ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి. 4.15 గంటలకు నగరంలోని నాలుగు చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. పోలీసులు, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్, వైద్య, రెవెన్యూ, స్థానిక అధికారులు ఆయా ప్రాంతాలకు 4.20 గంటల వరకు చేరుకుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమం అంతా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కొనసాగనుంది.