అడ్డగుట్ట, సెప్టెంబర్ 29: ద్విచక్ర వాహనాల దొంగలను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.10లక్షల విలువ చేసే 18 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వివరాల వెల్లడించారు.
కామారెడ్డికి చెందిన శ్రీనివాస్ 15 ఏండ్ల కిందట నగరానికి వచ్చాడు. 2020లో కొవిడ్‌తో అతడి భార్య మరణించింది. దీంతో 2022లో మరో పెండ్లి చేసుకున్నాడు. మూడు నెలలకే ఆమెను వదిలిపెట్టి.. మద్యం, గంజాయికి బానిసయ్యాడు. డబ్బుల కోసం దొంగతనాలు మొదలుపెట్టాడు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, మెదక్ ప్రభుత్వ ఆస్పత్రులు, మెట్రో స్టేషన్ల వద్ద బైక్‌లను దొంగిలించాడు.
చోరీ చేసిన వాహనాలను చర్లపల్లికి చెందిన ఏసు రత్నం(38), శాంతారావు(28), దమ్మాయిగూడకు చెందిన శ్రీను(32) కు విక్రయించాడు. బాధితుల ఫిర్యాదులతో కేసు నమోదు చేసుకున్న చిలకలగూడ పోలీసులు.. చాకచక్యంగా నలుగురిని పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.10లక్షల విలువ చేసే 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో చిలకలగూడ అదనపు డీసీపీ నర్సయ్య, ఏసీపీ జైపాల్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ అనుదీప్‌తో పాటు ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.