సిటీబ్యూరో, జనవరి 17(నమస్తే తెలంగాణ): గ్యాస్ సిలిండర్ వాల్వ్‌లో డ్రగ్స్ దాచి ఆన్లైన్ ట్రాన్స్‌పోర్టు సర్వీస్‌ల ద్వారా వాటిని సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం నేరేడ్మెట్లోని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. రాజస్థాన్, జోదాపూర్కు చెందిన మహేశ్ సరన్ గ్యాస్ రిపేర్ వర్క్స్ పనులు చేసుకుంటూ హైదరాబాద్ నేరేడ్మెట్లోని సైనిక్‌నగర్‌లో నివాసముంటున్నాడు. అతడికి రాజస్థాన్‌కు చెందిన డ్రగ్ పెడ్లర్ సముద్దీన్తో పరిచయం ఉంది.
ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లో డ్రగ్స్ కొని హైదరాబాద్‌లో వాటిని విక్రయించాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా 200 గ్రాముల హెరాయిన్‌ను లక్ష రూపాయలకు సముద్దీన్ వద్ద నుంచి కొనుగోలు చేసి, ఈనెల 10వ తేదీన హైదరాబాద్‌కు వచ్చాడు. నేరేడ్మెట్లో నివాసముంటూ గ్యాస్ మెకానిక్‌గా పనిచేస్తున్న తన స్వస్థలానికి చెందిన స్నేహితుడు మహిపాల్‌కు ఈ విషయం చెప్పాడు. 200 గ్రాముల హెరాయిన్ ద్వారా ఎలాగైనా రూ.20లక్షలు సంపాదించాలని ఇద్దరు ప్లాన్ చేశారు. వీరికి మహేశ్ పోర్టర్, ర్యాపిడో, ఉబర్లలో పనిచేసిన అనుభవం ఉన్నది. దీంతో హెరాయిన్‌ను చిన్న చిన్న ప్యాకెట్లలో నింపి అవసరమైన వారికి ఆన్లైన్ రైడింగ్ సర్వీస్‌ల ద్వారా సరఫరా చేస్తున్నారు. దీనికి తోడు ఇద్దరు గ్యాస్ మెకానిక్‌లు కావడంతో కొత్తగా ఆలోచించి, గ్యాస్ స్టౌవ్‌కు ఉండే వాల్వ్‌ను ఓపెన్ చేసి దాని మధ్యలో హెరాయిన్ ప్యాకెట్లు ఫిక్స్ చేసి తిరిగి కవర్‌ను సీల్డ్ చేస్తారు.
కస్టమర్లకు పంపించే సమయంలో వారి అడ్రస్‌కు గ్యాస్ వాల్వ్‌ను సరఫరా చేస్తారు.. ఎవరికీ దీనిపై అనుమానం రాకుండా కొత్త పంథాలో ఈ స్మగ్లింగ్ చేస్తున్నారు. పేమెంట్స్ కూడా జీపే, ఫోన్‌పేలలో తీసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటీ ఎల్బీనగర్ డీసీపీ మురళీధర్ నేతృత్వంలోని బృందం ఈ ముఠాను పట్టుకున్నది. విచారణలో పీకే గోటెమ్ అలియాస్ ప్రకాశ్, సురేశ్ అలియాస్ మనీష్ భిష్ణో, వినోద్ అలియాస్ సోపు భిష్ణో, బజరంగ్, మహేశ్, ముకేశ్‌కుమార్ తదితరులకు సరఫరా చేసినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
మహేశ్, మహిపాల్‌లను అరెస్ట్ చేసి ప్రధాన ఈ ముఠాలోని మరింత మంది కోసం గాలిస్తున్నామన్నారు. నిందితుల వద్ద నుంచి 190 గ్రాముల హెరాయిన్, రెండు బైక్‌లు, వేయింగ్ మిషన్లు తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.23లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్బంగా ఎస్ఓటీ పోలీసులను సీపీ అభినందించారు. డ్రగ్స్ దందాలు చేసే వారు కొత్త కొత్త పంథాలో తమ దందాను చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వాటిపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు ఛేదిస్తున్నామని సీపీ తెలిపారు. 2024వ సంవత్సరంలో రూ.88.34 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసినట్లు సీపీ వెల్లడించారు.