మేడ్చల్, ఆగస్టు 30: రూ. 20 వేల కోసం ఓ యువకుడిని ముగ్గురు కలిసి కొట్టి చంపారు. మేడ్చల్‌లో బుధవారం జరిగిన ఈ హత్య కేసులోని నిందితులను పోలీసులు పట్టుకుని, రిమాండ్‌కు తరలించారు. ఈ వివరాలను ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ శుక్రవారం వెల్లడించారు. ఏపీలోని అమలాపురానికి చెందిన కల్యాణ్ (26) గతంలో కేఎంపీ ఫుడ్స్ కంపెనీలో పని చేశాడు. ఆ సమయంలో అదే కంపెనీలో పనిచేసే గౌడవెల్లికి చెందిన శివకుమార్‌తో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ కంపెనీలో పని మానేశారు.
గతంలో ఉన్న పరిచయంతో ఇద్దరు అప్పుడప్పుడు కలుస్తూ మద్యం తాగారు. ఈ క్రమంలోనే కల్యాణ్ ఓ రోజు శివకుమార్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో కల్యాణ్ ముందే శివకుమార్ టేబుల్ సొరుగులో రూ. 20 వేల నగదు దాచి పెట్టాడు. ఆ రోజు ఇద్దరు మద్యం తాగి, తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. మరుసటి శివకుమార్ డబ్బులు చూసుకోగా కనిపించలేదు. కల్యాణ్ తీసుకొని ఉంటాడని భావిస్తూ ఫోన్‌చేయగా.. డబ్బులు తీసుకున్నట్టు కల్యాణ్ ఒప్పుకొని త్వరలోనే ఇస్తానని మాటిచ్చాడు. ఎన్నిసార్లు అడిగినా కల్యాణ్ డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో విసిగిపోయిన శివకుమార్ జరిగిన విషయాన్ని తనకు సోదరుడైన మహేందర్, బావమరిది సాయికుమార్‌తో చెప్పాడు.
ముగ్గురు కలిసి కల్యాణ్‌ను పట్టుకుని కొట్టాలని పథకం పన్నారు. కాగా, కల్యాణ్ ఈ నెల 28న శివకుమార్, సాయికుమార్‌కు మేడ్చల్‌లో భానుతేజ వైన్స్ వద్ద కనిపించాడు. డబ్బులు అడుగగా పట్టించుకోలేదు. శివకుమార్ వెంటనే తన సోదరుడైన మహేందర్‌కు ఫోన్‌చేసి.. కల్యాణ్‌ను డబ్బులు అడుగగా పట్టించుకోవడంలేదని చెప్పాడు. దీంతో మహేందర్ అతడిని తీసుకుని రావాలంటూ సూచించాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి గ్యాస్‌పైప్, వైర్ బండిల్‌తో దాడి చేశారు. కల్యాణ్ వారి దెబ్బలకు తాళలేక.. తాను ఉండే హాస్టల్ వద్దకు తీసుకెళ్లాలని, బైక్ అమ్మి రూ.20 వేలు చెల్లిస్తానని చెప్పాడు.
దీంతో శివకుమార్, మహేందర్, సాయికుమార్ కలిసి కల్యాణ్‌ను వినాయక్‌నగర్‌లోని విఘ్నేశ్వర హాస్టల్ వద్దకు తీసుకెళ్లారు. అయితే, అక్కడికి వెళ్లిన తర్వాత డబ్బులు చెల్లించలేని పరిస్థితిని గుర్తించారు. ఇక ఎప్పటికీ డబ్బులు చెల్లించలేడని, అంతమొందించాలని భావించి, మరోసారి దాడిచేసి చంపేశారు. అనంతరం అక్కడి నుంచి బైక్‌పై పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను గౌడవెల్లి క్రాస్‌రోడ్డులో పట్టుకున్నారు. వారి నుంచి రెండు బైక్‌లు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.