సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు బస్సులో గంజాయి రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మీర్జా ఫయాజ్ అలీబేగ్ మహారాష్ట్ర నుంచి గంజాయి కొనుగోలు చేసి నగరంలో విక్రయాలు జరుపుతున్నాడు. ఇందులో భాగంగానే శనివారం ఉదయం మహారాష్ట్ర నుంచి నగరానికి కాళేశ్వర్ ఓల్వా ట్రావెల్స్ బస్సులో గంజాయి తీసుకుని వస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు శనివారం ఉదయం 7గంటల సమయంలో సుచిత్రా వద్ద బస్సును ఆపి, తనిఖీలు జరిపారు. ఈ తనిఖీలలో మీర్జాఅలీ వద్ద ఉన్న బ్యాగ్‌లో రెండు కిలోల గంజాయి లభించింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును కొంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
మరో కేసులో…
కాప్రాలోని దమ్మాగూడ, సాయిబాబానగర్‌లో సయ్యద్ సాధిక్ అనే వ్యక్తి గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నాడు. సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును కాప్రా ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.