శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 7: కోట్లాది రూపాయలు వసూళ్లు చేసి బోర్డు తిప్పేసిన ఓ చిట్‌ఫండ్ సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బుధవారం గచ్చిబౌలి కార్యాలయంలో మాదాపూర్ డీసీపీ వినీత్ వివరాలను వెల్లడించారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఎల్పుల శ్రీనివాస్(47), అతడి కుమారుడు రాకేష్(27), ఎల్బీనగర్కు చెందిన గణేశ్ కలిసి 6 నెలల కిందట మాదాపూర్‌లో సమతామూర్తి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరులో చిట్‌ఫండ్ వ్యాపారం ప్రారంభించారు. రూ.5 లక్షలు నుంచి కోటి రూపాయల వరకు చిట్టీలు నిర్వహించి.. అమాయక ప్రజలను నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఆ తర్వాత చిట్టీ డబ్బులను బాధితులకు చెల్లించడంలో సంస్థ జాప్యం చేసింది. వినియోగదారులకు ఇచ్చిన చెక్కులు కూడా బ్యాంకుల్లో చెల్లలేదు. ఇదంతా మోసమని గ్రహించిన 120 మంది బాధితులు జనవరి 13న మాదాపూర్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చిట్‌ఫండ్ డైరెక్టర్లు ఎల్పుల శ్రీనివాస్, రాకేష్‌ను మంగళవారం అరెస్టు చేశారు. సుమారు రూ. 5 కోట్ల వరకు చిట్‌ఫండ్ నిర్వాహకులు మోసాలకు పాల్పడినట్లు డీసీపీ తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.
ఈ చిట్‌ఫండ్ సంస్థకు ఎలాంటి అనుమతులు లేవని డీసీపీ తెలిపారు. సమతామూర్తి పేరును వాడుకోవడం జరిగిందన్నారు. చినజీయర్ స్వామికి, ఈ సంస్థకు ఎలాంటి సంబంధాలు లేవని మీడియా అడిగిన ప్రశ్నకు డీసీపీ బదులిచ్చారు. ఈ సమావేశంలో మాదాపూర్ అడిషనల్ డీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి, ఇన్స్పెక్టర్ మల్లేశ్ పాల్గొన్నారు.