సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ): సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రేటర్ పరిధిలోని 259 బస్తీ దవాఖానల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీజనల్ ప్రారంభానికి ముందే డెంగీ కేసులు నమోదవుతుండటంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. సీజనల్ వ్యాధిగ్రస్తులకు అవసరమైన చికిత్స అందించడం, వ్యాధులు ప్రబలకుండా చర్యలను ముమ్మరం చేశారు.
మూడు రోజుల్లో తగ్గకపోతే…
సీజన్లో వచ్చే జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలున్న రోగులకు స్థానిక ఆరోగ్య కేంద్రాల్లోనే సీజనల్ పరీక్షలు చేసి, మందులు ఇచ్చేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అలాగే రోగికి మూడు నుంచి ఐదు రోజుల్లో లక్షణాలు తగ్గకపోతే వెంటనే వారికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
బస్తీ దవాఖానల్లోనే ఏర్పాట్లు..
గ్రేటర్ పరిధిలోని 259 బస్తీ దవాఖానలు, 177ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు జిల్లా దవాఖానల్లో సీజనల్ వ్యాధులకు సంబంధించి చికిత్స, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వైద్యాధికారులు ఏర్పాట్లు చేశారు. అన్ని బస్తీ దవాఖానల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వైద్యశాఖ ఇప్పటికే కిట్లను సిద్ధం చేసింది. డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో వైద్య అధికారులు ఫీవర్ సర్వే చేయడం, దోమల నివారణకు ఎంటమాలజీ విభాగంతో పాటు జీహెచ్ఎంసీతో కలిసి యాంటి లార్వా, ఫాగింగ్, డ్రైడే వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే, డెంగీ కేసులు నమోదైన ప్రాంతాలు, బస్తీల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం, బస్తీ దవాఖానల్లోనే డెంగీ బాధితులకు పూర్తిస్థాయి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
బస్తీ స్థాయిలోనే నివారించేందుకు చర్యలు..
మూడు రోజుల్లో జ్వరం, జలుబు, దగ్గు వంటివి తగ్గకుంటే వారికి కరోనా పరీక్షలు చేస్తాం. సీజనల్‌కు సంబంధించి మలేరియా, డెంగీ, టైఫాయిడ్, డయేరియా తదితర వ్యాధులకు సంబంధించి నిర్ధారణ పరీక్షలు బస్తీ దవాఖానలు, యూపీహెచ్‌సీల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. సీజనల్ వ్యాధులను దాదాపు బస్తీ దవాఖానల స్థాయిలోనే నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఐవీ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్, యాంటిబయాటిక్ మందులతో పాటు ఇతర అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాం. డెంగీ, దోమల నివారణపై అవగాహన కల్పించేందుకు ఫ్రైడే-డ్రై డే కార్యక్రమం, యాంటి లార్వా తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
– డాక్టర్ వెంకటి, వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, హైదరాబాద్ జిల్లా