Ganesh Immersion | సిటీబ్యూరో: ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనం అనేక ఏండ్లుగా కొనసాగుతున్నదని, కొత్త రూల్స్ తీసుకొచ్చి.. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు మండిపడ్డారు. ఆదివారం హుస్సేన్ సాగర్ వద్ద ఆందోళన చేపట్టిన ఉత్సవ సమితి సభ్యులు.. ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బారికేడ్లను తొలగించారు.
వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. ట్యాంక్‌బండ్‌పై నిమజ్జన ఏర్పాట్లు చేయాలని, లేదంటే సోమవారం అన్ని మండపాల నిర్వాహకులకు సమాచారమిచ్చి.. నగరవ్యాప్తంగా ఆందోళన చేసి.. ఎక్కడికక్కడ మండపాల్లో వినాయకులను అలాగే ఉంచుతామని హెచ్చరించారు. ఉత్సవ సమితి సభ్యుల ఆందోళనకు దిగొచ్చిన ప్రభుత్వం హడావిడిగా ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
గణేశ్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు 10 సర్కిళ్ల పరిధిలోని ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి, క్షేత్ర స్థాయిలో ఉండి పర్యవేక్షణ చేయాలని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఇప్పటికే ఆదేశించారు.
ఇందులోభాగంగానే ఎన్టీఆర్ మార్గ్‌లో విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను ఇటీవలే సీఎండీ ప్రారంభించారు. నిమజ్జనం సందర్భంగా ప్రత్యేకంగా నిర్ణయించిన మార్గాల్లో శోభాయాత్రను నిర్వహిస్తున్న నేపథ్యంలో సరఫరా నిరంతరం ఉండేందుకు, విద్యుత్ అదనపు లోడ్‌కు సరిపోయేలా 500 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు , 315 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 31, 160 కేవీఏ సామర్థ్యంతో కూడిన 37 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు సాగే గణేశ్ విగ్రహాల శోభాయాత్ర కోసం సుమారు 55 కి.మీ మేర 11 కేవీ ఎల్టీ కేబుళ్లు, పోల్స్, కండక్టర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. కాగా, శోభాయాత్ర మొదలై నిమజ్జనం పూర్తయ్యే వరకు సూపరింటెండెంట్ ఇంజినీర్లు, డివిజినల్ ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో ఉండి పర్యవేక్షణ చేయనున్నారు. హుస్సేన్‌సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని, మండప నిర్వాహకులు, ప్రజలు విద్యుత్ భద్రత సూచనలు పాటిస్తూ ఎక్కడైనా అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడితే కంట్రోల్ రూమ్ లేదా 100, 1912 నంబర్లకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
గణపతి నవరాత్రోత్సవాల్లో కీలక ఘట్టమైన నిమజ్జనానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.హెచ్ఎండీఏ, ఆర్ అండ్ బీ, జలమండలి, గ్రేటర్ డిస్కం, పర్యాటక, పోలీస్ శాఖలు సమన్వయం చేసుకుంటూ.. ప్రశాంత వాతావరణంలో నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాయి. హుస్సేన్‌సాగర్, జీడిమెట్ల ఫాక్స్ సాగర్, బహదూర్‌ఫుర, మిరాలం చెరువు, కాప్రా ఊర చెరువు, సరూర్‌నగర్ ట్యాంక్‌బండ్‌తో సహా పీవోపీ విగ్రహాల కోసం ప్రత్యేకంగా 73 కొలనులను ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో క్రేన్లను అందుబాటులో ఉంచారు.
ఆరు జోన్ల పరిధిలో స్టాటిక్ క్రేన్స్ 21, మొబైల్ క్రేన్స్ 295, 213 గణేశ్ యాక్షన్ బృందాలను నియమించారు. వ్యర్థాలను తరలించేందుకు మినీ టిప్పర్లు 102, 125 జేసీబీలను సిద్ధం చేశారు. శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహణ పనులతో పాటు తాత్కాలిక పనులు చేపట్టారు. నిర్వహణ పనులు 172లకు గానూ రూ.12 కోట్లు, తాత్కాలిక పనులు 36కి గానూ రూ.16కోట్లు ఖర్చు చేస్తున్నారు. 52వేల లైట్లను బిగించారు. భక్తుల సౌకర్యార్థం 309 మొబైల్ టాయిలెట్లను అందుబాటులో ఉంచారు.