మనకూ..హస్తినా తరహాలో ‘కాలుష్య’ ప్రమాదం పొంచి ఉందా..?
‘శ్వాస గోస’ తప్పదా..? అంటే పరిస్థితి ఇలాగే కొనసాగితే అలాంటి ముప్పు తొందరలోనే తలెత్తే అవకాశముందంటున్నారు పర్యావరణవేత్తలు. ప్రస్తుతం గ్రేటర్ రహదారులు దుమ్ము.. ధూళితో దట్టమైన పొగలు అల్లుకున్నట్లు దర్శనమిస్తున్నాయి. ఏ ప్రధాన రహదారి చూసినా.. ఇలాగే ఉంది. పెద్ద వాహనాల వెనుక వెళ్లాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. మొన్నటివరకు వరుసగా కురిసిన వర్షాలతో రోడ్లన్నీ వరద, బురదతో నిండిపోయి.. జనాలు తీవ్రంగా అవస్థలుపడ్డారు. ఇప్పుడేమో.. వరదతో కొట్టుకొచ్చిన మట్టి, ఇసుక మేటలతో రహదారులు నిండిపోయాయి.
వాటిపై నుంచి వాహనాలు వేగంగా వెళ్తుండటంతో దారి వెంట విపరీతంగా దుమ్ము రేగుతున్నది. దీంతో పీఎం-2.5, పీఎం-10 ధూళి కణాలు గాలిలో కలిసిపోతున్నాయి. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నది. ధూళి కణాలు దట్టమైన పొగలా వ్యాపిస్తుండటంతో ప్రయాణికులు, పాదచారుల అవస్థలు వర్ణణాతీతం. బయటకెళ్లాలంటేనే..జంకే స్థితి దాపురిస్తున్నది. తక్షణం నియంత్రణ చర్యలు చేపట్టకపోతే.. శ్వాసకోశ..గుండె..నాడీ మండల వ్యాధులు సోకే ప్రమాదం లేకపోలేదంటున్నారు నిపుణులు.
-సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ)
గ్రేటర్ హైదరాబాద్ రహదారులు దుమ్ము.. ధూళితో నిండిపోతున్నాయి. దీంతో నగరంలో ప్రయాణం ప్రయాసగా మారింది. వాహనాలు స్పీడుగా వెళ్తుండటంతో దారి వెంట దుమ్ము విపరీతంగా వస్తున్నది. ఫలితంగా పీఎం-2.5, పీఎం-10 ధూళి కణాలు గాలిలో కలిసిపోతున్నాయి. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధూళి కణాలు దట్టమైన పొగల్లా చేరి ద్విచక్రవాహనదారులు, ఆటోలో వెళ్లేవారు, పాదచారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఇక నిర్మాణం జరిగే ప్రాంతాల్లోనైతే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటున్నది. రోడ్లపై వర్షాలకు ఏర్పడిన ఇసుక మేటలతో పాటు నిర్మాణాల నుంచి వచ్చే ధూళితో పరిసర ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందులుపడుతున్నారు. వర్షాలు తగ్గిన వెంటనే రోడ్లపైన ఏర్పడిన మట్టి, ఇసుక మేటలను తొలగిస్తే.. ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. వర్షాలు వస్తే వరదలు, బురదతో ఇబ్బందులు పడితే.. ఇప్పుడు దుమ్ము, ధూళితో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ ముఖ్యమైన ప్రాంతాల్లో..
వర్షాలకు రహదారులపై ఏర్పడిన మట్టి, ఇసుక మేటలను తొలగించకపోవడంతో ప్రమాదకరమైన పీఎం (పార్టిక్యులేట్ మ్యాటర్)-10, పీఎం-25 ధూళి కణాలు పెరిగిపోతున్నాయి. నగరంలో కాలుష్యం స్థాయిలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ముఖ్యమైన ప్రాంతాలైన సోమాజిగూడ, నెహ్రూ జూపార్క్, కొంపల్లి, పాశమైలారం, పటాన్చెరు, ఈసీఐఎల్, బొల్లారం, ఉప్పల్, న్యూ మలక్‌పేటలో పీఎం-10, పీఎం-2.5 ధూళి కణాలు గాలిలో 80 నుంచి 180 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి.
గ్రేటర్‌తో పాటు శివారు జిల్లాలు సంగారెడ్డి, మేడ్చల్, వికారబాద్‌లో కూడా వీటి స్థాయిలు ప్రమాదకరంగా నమోదవుతున్నాయి. పారిశ్రామికవాడలు, నిర్మాణ ప్రాంతాల్లో వీటి స్థాయిలు మరింత ప్రమాదకరంగా నమోదవుతున్నాయి. ఇక ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో విడుదలవుతున్నాయి. వర్షాలు తగ్గగానే ఇసుక మేటలను తొలగించాల్సిన అధికారుల మొద్దు నిద్ర వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అటు కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలు అసలే లేకపోవడంతో బల్దియా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ప్రాణాలను హరించే విషపు ధూళి కణాలు గాలిలో చేరుతున్నా.. పట్టించుకోవడంలేదు. ఈ దుస్థితి ఇలాగే కొనసాగితే గ్రేటర్ హైదరాబాద్‌లోనూ దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితులే దాపురిస్తాయని పర్యావరణవేత్తలు, మేధావులు హెచ్చరిస్తున్నారు. పీఎం-10, పీఎం-2.5, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్ వంటి హానికర విష వాయువుల విడుదలకు కారణాలను అన్వేషించి నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
పీఎం-10, పీఎం-2.5 ధూళి కణాలు అంటే..
గాలి కాలుష్యంలోని ప్రధానమైన ఉద్గారాల్లో పార్టిక్యులేట్ మ్యాటర్(పీఎం-10, పీఎం-2.5) ఒకటి. ఈ ధూళి కణాలు ఒక ఘనపు మీటరు విస్తీర్ణంలోని గాలిలో కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం 60 మైక్రోగ్రాములు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం 40 మైక్రో గ్రాముల కంటే మించకూడదు. పీఎం-10 కారకాలు అంత కంటే ఎక్కువ ఉంటే అత్యంత ప్రమాదకరం. కానీ గ్రేటర్ పరిధిలోని ఎక్కువ ప్రాంతాల్లో కొద్దిరోజులుగా దీని స్థాయిలు ఒక ఘనపు మీటరు గాలిలో 80 మైక్రోగ్రాముల కంటే ఎక్కువే విడుదలవుతున్నాయి.
శ్వాసకోశ, గుండె వ్యాధులు
పీఎం-10 ధూళి కణాల తీవ్రత ఎక్కువగా గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ, గుండె, న్యూరో సంబంధిత వ్యాధులు ప్రబలుతాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధులైన ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి (సీవోపీడీ), ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ప్రధానంగా చిన్నపిల్లల్లో ఊపరితిత్తుల పనితీరు మందగించడం సంభవిస్తాయి. అదేవిధంగా గుండెపోటుకు దారితీయడం, రక్తపోటు, గుండె కొట్టుకోవడంలో మార్పులు వచ్చే ప్రమాదముంది. న్యూరో సంబంధిత పార్కిన్సన్స్, అల్జీమర్స్ వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పీఎం-10 తీవ్రత ఎక్కువగా ఉన్న గాలితో మహిళల్లో గర్భ సంబంధిత వ్యాధులతో పాటు గర్భం దాల్చడంలో లోపాలు వస్తాయని అంటున్నారు.