సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): నగరంలోకి కంట్రీమేడ్ పిస్టల్స్ విచ్చలవిడిగా వస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మల్కాజిగిరిలో కంట్రీమేడ్ పిస్టోల్‌తో భార్యను భర్త కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నిందితుడు గతంలో బీహార్ నుంచి తుపాకీ తెచ్చుకోగా, తాజాగా మహారాష్ట్ర నుంచి తుపాకీ తెచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ వంటి సుదూర రాష్ర్టాల నుంచి మాత్రమే కాకుండా పక్కనే మహారాష్ట్ర వైపు నుంచి కూడా నగరంలోకి మారణాయుధాలు చేరుతుండడం ఆందోళన కల్గిస్తోంది. నేరస్థులు ఇప్పుడు తమ రూట్‌ను పొరుగునే ఉన్న మహారాష్ట్ర వైపు మళ్లించారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరిలో జరిగిన దారుణ హత్య, ఈ అక్రమాయుధాల రవాణా వెనుక ఉన్న సరిహద్దు నెట్‌వర్క్‌ను బట్ట బయలు చేసింది.
మారిన నేరగాళ్ల రూట్
గతంలో రాష్ట్రంలో దొరికిన అక్రమ ఆయుధాల కేసులకు సంబంధించిన గ్యాంగ్‌లు ఎక్కువగా గన్స్ యూపీ, బీహార్ రాష్ట్రల నుంచి తెచ్చినట్లు విచారణలో ఒప్పుకున్న ఘటనలున్నాయి. ఇక్కడి నుంచి తుపాకులు తెప్పించుకోవడానికి మధ్యవర్తులను ఎక్కువగా ఆశ్రయించాల్సి వస్తోందని నేరగాళ్లు బావిస్తున్నారు. దానితో పాటు అక్కడి నుంచి వచ్చే వారిపై నిఘా ఎక్కువగా ఉండడంతో పోలీసులకు దొరికిపోతామనే భయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిన్నారు.
ఈ నేపధ్యంలో ఇందుకు ప్రత్యామ్నాయాల వైపు నేరస్థులు చూస్తున్నారని సందేహాలు వ్యక్తమవుతున్నా యి. ఈ క్రమంలోనే తెలంగాణ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ఉమ్రి ప్రాంతం వైపు దృష్టి పెడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని సరిహద్దు ప్రాంతాలలో నుంచి ఉమ్రికి తుపాకుల సరఫరాతో పాటు అక్కడే తుపాకులు తయారు చేసే వాళ్లు కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లతో లింక్ ఉన్న భారీ నెట్‌వర్క్‌ను కూడా అక్కడి పోలీసులు భారీ అపరేషన్ నిర్వహించి పలువురి వద్ద నుంచి తుపాకులు స్వాధీనం చేసున్నారు.
హత్య కేసు విచారణతో వెలుగులోకి..
మల్కాజిగిరిలో జరిగిన తాజా హత్య కేసు విచారణలో దిగ్బ్రాంతికరమైన విషయాలు వెలుగు చూశాయి. భార్య నిషారాణిపై అనుమానం పెంచుకున్న భర్త అరుణ్‌కుమార్ గతంలోనే ఆమెను గన్‌తోనే చంపేందుకు కుట్ర చేశాడు. గత జనవరిలో మహారాష్ట్రలోని ఉమ్రి ప్రాంతానికి వెళ్లి గన్ గురించి నిందితుడు వాకబు చేసి వచ్చాడు. అయితే అక్కడ అతనికి గన్ దొరకలేదు. దీంతో ముజిమిల్ సహకారంతో రూ. 1.45 లక్షలు వెచ్చించి బీహార్ నుంచి గన్ ను తెప్పించాడు. ఈ గన్ తెప్పించిన కొన్ని రోజులకే అంబర్పేట్ పోలీసులకు పట్టుబడ్డాడు. గన్ ఇప్పించిన ముజమిల్తో పాటు అరుణ్‌కుమార్‌ను అంబర్పేట్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత అరుణ్‌కుమార్ తిరిగి గన్ కోసం వెతకడం ప్రారంభించాడు.
గతంలో తనకు గన్ ఇప్పించిన ముజమిల్, తనతోపాటే జైలో ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరు కొన్ని రోజుల విరామంతో జైలు నుంచి బయటకు వచ్చారు. అరుణ్‌కుమార్ గన్ కోసం ప్రయత్నిస్తుండగా మరోసారి ముజమిల్ సహకరించాడు. మహరాష్ట్రలో ఉమ్రికి వెళ్లి గన్ తెచ్చుకోవాలని సూచించాడు. దీంతో అరుణ్‌కుమార్ మరోసారి ఉమ్రికి వెళ్లి ప్రయత్నించాడు. రూ. 45 వేలు వెచ్చించి మే చివరి వారం లో గన్ కొనుగోలు చేశాడు. బుధవారం తెల్లవారుజామున అరుణ్‌కుమార్ తన భార్య నిషారాణిని నిద్రలో నుంచి లేపి గొడవ పడ్డాడు. ఆమె నిద్రమత్తులో నుంచి తేరుకోక ముందే ఆమెను కొట్టడంతో తేరుకున ఆమె అత్తమ్మా అని అరుస్తుండగా గన్ తీసి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. అందులో రెండు బుల్లెట్ నిషారాణి శరీరంలోకి దూసుకుపోయాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘోరానికి పాల్పడిన తుపాకీ పొరుగు రాష్ట్రం నుంచి ఈజీగా నిందితుడు కొనుగోలు చేసి తెచ్చిపెట్టుకోవడం గమనార్హం.
భార్యను గన్‌తో కాల్చి చంపిన భర్త అరెస్ట్
సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): అనుమానంతో భార్యను గన్‌తో కాల్చి చంపిన భర్తను, అతడికి ఆయుధం అందించడంలో సహకరించిన మరో పాత నేరస్తుడిని మల్కాజిగిరి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గురువారం మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ వివరాలు వెల్లడించారు. మల్కాజిగిరి మారుతీనగర్‌లో నివాసం ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారి అరుణ్‌కుమార్, తన భార్య నిషారాణిపై అనుమానంతో ఆమెను హత్య చేసేందుకు గత కొంత కాలంలో ప్లాన్ చేశాడు. అందుకు గతంలో కంట్రీ మేడ్ పిస్టోల్‌ను కొనుగోలు చేసి ఆమెను హత్య చేసేందుకు కుట్ర చేశాడు. అయితే పోలీసుల తనిఖీలలో రివ్వాలర్ దొరకడంతో అరుణ్‌కుమార్‌తో పాటు అతడికి తుపాకీ అందించిన మిర్ ముజిమిల్ అలీఖాన్‌తో పాటు మరో వ్యక్తిని అంబర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
జైలు నుంచి గత నెలలో బయటకు వచ్చిన అరుణ్‌కుమార్‌కు భార్యపై కోపం తగ్గలేదు. ఈ క్రమంలోనే మరోసారి మిర్ ముజమిల్ అలీఖాన్ సహకారంతో మహారాష్ట్ర నుంచి కంట్రీమేడ్ పిస్టోల్‌ను కొనుగోలు చేశాడు. ఇదిలాఉండగా భార్య, భర్తల మధ్య ఐదు రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున తన వద్ద ఉన్న గన్‌తో కాల్చి భార్యను హత్య చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడు అరుణ్‌కుమార్‌ను మౌలాలీ రైల్వే స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు గత నెల 27న మహారాష్ట్రలోని ఉమ్రి ప్రాంతం నుంచి మిర్ ముజమిల్ అలీ ఖాన్ సహకారంతో కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో ప్రధాన నిందితుడు అరుణ్‌కుమార్‌తో పాటు ముజమిల్ అలీఖాన్‌ను అరెస్ట్ చేశారు. అరుణ్‌కుమార్‌కు సహకరించిన మరో వ్యక్తి హరిందర్ సింగ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.