సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటీగా అందుబాటులోకి వస్తున్నాయి. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా రూ. 5112.36 కోట్ల అంచనా వ్యయంతో 47 ప్రాజెక్టులు చేపట్టగా, తాజాగా రూ. 629.30 కోట్లతో ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు ఆరు లేన్లతో 119 పిల్లర్లతో 4.08 కిలోమీటర్ల మేర చేపట్టిన భారీ ఫ్లై ఓవర్ ప్రారంభానికి తుది మెరుగులు దిద్దుకుంటున్నది.
వచ్చే నెల మొదటివారంలో అందుబాటులోకి తెచ్చేందుకు ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్ఆర్డీపీలో ఇప్పటివరకు 36 ప్రాజెక్టులు అందుబాటులోకి రాగా, ఆరాంఘర్ ఫ్లై ఓవర్‌తో ఆ సంఖ్య 37కు చేరుకుంటుంది. ఇందులో 22 ఫ్లై ఓవర్లు, ఐదు అండర్‌పాస్‌లు, ఆర్వోబీ/ఆర్యూబీ ఆరు, ఒక కేబుల్ బ్రిడ్జి, పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, రహదారి విస్తరణ పనులను చేపట్టి అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఎస్ఆర్డీపీ ఫలాలు ఒక్కొక్కటిగా గ్రేటర్ ప్రజలకు రేవంత్‌రెడ్డి సర్కారు అందిస్తున్నది.
హైదరాబాద్‌ను సిగ్నల్ ఫ్రీ నగరంగా చేసేందుకు వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ఫలాలు విడతల వారీగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే పాతనగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే ఓవైసీ ఫ్లై ఓవర్, అబ్దుల్ కలాం ఫ్లై ఓవర్, చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ అందుబాటులోకి తీసుకురాగా, ఆరాంఘర్-జూపార్కు ఫ్లై ఓవర్‌తో శంషాబాద్ విమానాశ్రయం వరకు ప్రయాణం సాఫీగా సాగనున్నది. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు రవాణా మెరుగుపరచడమే కాకుండా సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థకు దోహద పడుతుంది.