సిటీబ్యూరో: కేబీఆర్ వన్‌వేతో వాహన ఆధారిత యాప్ సేవలు భగ్గుమన్నాయి. ఓలా, ర్యాపిడో, ఉబర్ తదితర యాప్‌లు కేబీఆర్ పరిసరాల్లో రైడ్స్ ఓకే చేసేందుకు రెట్టింపు ధరలు చూపించాయి. చాలా మంది యాప్ డ్రైవర్లు ఆదిశలో రైడ్లను తీసుకోకుండా రద్దు చేయడం విశేషం. మరికొందరూ రైడ్ ఓకే చేసి రైడర్స్‌కు కాల్ చేసి అధిక డబ్బులు డిమాండ్ చేశారు. ఇంకొందరూ 300-500 మీటర్లు నడుచుకుంటూ తమ వాహనం దగ్గరికి రావాలంటూ షరతులు పెట్టారు.
ఇలా కేబీఆర్ పరిసరాల్లో రైడర్స్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వన్‌వేకు ముందర బసవతారకం నుంచి ఎల్వీ ప్రసాద్ వెళ్లాలంటే ఒక్క రైడ్ రూ.20- 30 రూపాయలు ఉండేది. ఇప్పుడు వన్‌వే కావడంతో వంద రూపాయలు మించి ధరలు చూపిస్తున్నాయి. దీంతో రైడర్స్ యాప్ సేవలను పక్కనపెట్టి కాలినడకలో సమీపంలోని గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. మొత్తంగా వన్‌వే విధానంతో వాహన ఆధారిత యాప్ సేవలు వినియోగించుకోవడంలో ఆర్థికంగా, సమయం పరంగా ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితులు ఉన్నాయి.