సిటీబ్యూరో, మే 28(నమస్తే తెలంగాణ): అసలు తాము సభ్యులం ఉన్నామని గుర్తించే వారే దేవాదాయశాఖలో లేరని, సమావేశాలకు సంబంధించి ప్రొటోకాల్ పాటించడం లేదంటూ అర్చక సంక్షేమబోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సెక్రటేరియేట్‌లో తెలంగాణ అర్చక ఉద్యోగ సంక్షేమ ట్రస్ట్ సభ్యుల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో రెవెన్యూ సెక్రటరీ, అర్చక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ నవీన్ మిట్టల్, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్యర్, రిటైర్డ్ జడ్జ్ వామన్‌రావు, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు, ఏడీసీ శ్రీనివాసరావు, సభ్యులు కాండూరు కృష్ణమాచార్యులు, చిలకమర్రి శ్రవణ్‌కుమారాచార్యులు, జక్కాపురం నారాయణ స్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గత సంవత్సరం నుంచి ట్రస్ట్ ద్వారా జరిగిన లావాదేవీలు, అర్చక ఉద్యోగ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఖర్చు చేసిన నిధులు, వెల్ఫేర్ ఫండ్ నుంచి ఈసారి చేయాల్సిన పనులపై చర్చ జరిగింది. ఇందులో అర్చక ఉద్యోగులకుఅందించాల్సిన సంక్షేమం విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై సభ్యులు అధికారుల ముందే దేవాదాయశాఖ ఏడీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇటీవలే బాధ్యతలు తీసుకున్నానని, గతంలో జరిగిన తప్పులను పట్టించుకోవద్దని ఏడీసీ చెప్పడంతో సభ్యులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఒకదశలో దేవాదాయశాఖ ప్రధాన అధికారి కూడా తనకు సభ్యులెవరో కూడా తెలియదనడంతో కొంతసేపు గందరగోళం తలెత్తింది.
పెన్షన్ స్కీమ్‌కు ఏకగ్రీవ ఆమోదం..
సమావేశంలో అర్చక ఉద్యోగ సంక్షేమ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ తదితరులు ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చ జరిపి అందుకు తగినట్లుగా సంక్షేమ పథకాలకు కేటాయించే డబ్బులను పెంచడంతో పాటు పెన్షన్ స్కీమ్‌కు సంబంధించిన తీర్మానానికి కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అర్చక ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ఇన్సూరెన్స్‌ను రూ.5లక్షలకు ఆమోదించారు. గ్రాట్యుటీని రూ.8లక్షలకు పెంచగా, అర్చక ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత నెలకు రూ.10వేల నుంచి రూ.20వేల మధ్యలో ఒక పెన్షన్ సదుపాయాన్ని అందించేలా తీర్మానం చేశారని సభ్యులు కాండూరి కృష్ణమాచార్య తదితరులు తెలిపారు.
కళ్యాణలక్ష్మి పథకానికి సంబంధించి గతంలో ఎమ్మార్వో సర్టిఫికెట్ తీసుకురావలసిన చోట ఇప్పుడు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆమోదం తెలిపితే చాలంటూ తీర్మానం చేశారు. ఇకనైనా ప్రొటోకాల్ పాటించి సభ్యులతో అన్ని విషయాలు చర్చించాలని, ఎటువంటి అపోహలకు తావు లేకుండా పనిచేయాలని దేవాదాయశాఖ ముఖ్య అధికారులు సూచించారు. అర్చక ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించినందుకు అధికారులకు, బోర్డు సభ్యులకు జేఏసీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.