ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఎస్సీ మాలిక్యులర్ అండ్ హ్యూమన్ జెనెటిక్స్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) ప్రాయోజితం చేస్తున్న ఈ కోర్సును ఓయూ పరిధిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిసీజెస్ అందిస్తోందని చెప్పారు.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆఫ్ బయోటెక్నాలజీ (జీఏటీ-బీ) పరీక్షలో అర్హత సాధించిన వారు ఈ కోర్సులో చేరేందుకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వచ్చే నెల 9వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్లో చూసుకోవచ్చన్నారు.