సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఊహించినట్లుగానే.. 300 వార్డుల విభజనపై ఎవరెన్ని చెప్పినా.. ఏ రూట్లో వచ్చినా.. డోంట్ కేర్ అంటూ సర్కారు ముందుకు సాగుతున్నది. సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను కమిషనర్ సవాల్ చేస్తూ అప్పీల్ పిటిషన్లను దాఖలు చేశారు. వార్డుల జనాభా, వివరాలు, వార్డుల ఏర్పాటుకు ప్రామాణికంగా తీసుకున్న మ్యాప్‌లను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్లో ఉంచాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను పిటిషనర్ల వరకే పరిమితం చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ పాక్షికంగా సవరించింది. ఆశ్రయించిన నలుగురు కక్షిదారులకు సంబంధించిన వార్డులు, మ్యాప్‌ల వివరాలను జీహెచ్ఎంసీ వెబ్సైట్లో పొందుపర్చాలని ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
అందరికీ డొమైన్లో ఉంచడం కుదరదని, డీలిమిటేషన్ నోటిఫికేషన్ చట్ట నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ వాయిదా వేసింది. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో అధికారులు తుది నోటిఫికేషన్ జారీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే 5905 అభ్యంతరాలకు సంబంధించి పరిష్కరించగా, సోమవారం తుది నోటిఫికేషన్‌ను ప్రభుత్వానికి అందజేసే దిశగా ఏర్పాట్లు జరుగుతుండడం గమనార్హం.
ప్రస్తుతం 2011 జనాభా లెకలు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వద్ద ఉన్న తాజా గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుని డీలిమిటేషన్ చేపట్టారు. సగటున 45 వేల జనాభాకు ఒక వార్డు చొప్పున (10 శాతం అటు ఇటుగా) విభజన చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే చాలా డివిజన్లలో 20 వేలలోపు జనాభాతో ఉదాహరణకు భారతీనగర్, తెల్లాపూర్, ఎగ్జిబిషన్ గ్రౌండ్లు ప్రత్యేక వార్డులు కేటాయించారు. అభ్యంతరాల స్వీకరణలో భాగంగా ఎక్కువగా వార్డుల పేర్లు మారాయని, వార్డు పేరుతో ఉన్న ప్రాంతాలు ఆ డివిజన్లో కాకుండా పక్క డివిజన్లలోకి చేర్చారని, బౌండరీలు సరిగ్గా లేవని, బౌండరీల హద్దులు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదని, జనాభాలో వ్యత్యాసాలు ఉన్నాయని, ఇప్పటి వరకు ఉన్న వార్డులను రెండు, మూడు, నాలుగు ముక్కలుగా చేసి విభజించారన్న అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి.
అయితే వార్డుల జనాభా, మ్యాపుల ప్రదర్శనల ద్వారా అధికారుల తప్పిదాలు వెలుగులోకి వస్తాయనే కారణాలతోనే గుట్టుగా ముగించాలని భావించారు. ఈ నేపథ్యలోనే సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ శుక్రవారం అత్యవసర లంచ్ మోషన్ రూపంలో అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం వార్డుల పునర్విభజనపై సింగిల్ జడ్జి ఉత్తర్వుల సవరణ చేస్తూ ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టుకొచ్చిన ఆ నలుగురికి సంబంధించి మాత్రమే వార్డులు, మ్యాప్‌లనే బహిరంగపర్చాలని ఆదేశించింది.
వార్డుల పునర్విభజన ప్రక్రియను న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయానని భావించిన అధికారులు ఫైనల్ నోటిఫికేషన్‌ను కమిషనర్ శనివారం లేదా సోమవారం ప్రభుత్వానికి నివేదిక పంపించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తున్నది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే రిజర్వేషన్ల ప్రక్రియ మొదలుకానున్నది. వార్డుల వారీగా ఉన్న జనాభా లెకల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మహిళా కేటగిరీల వారీగా రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేయనున్నారు. రిజర్వేషన్లపై కూడా ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, వాటిని పరిషరించిన తర్వాత తుది జాబితా ప్రకటిస్తారు. ఆ తర్వాతే 300 వార్డులకు ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణన ప్రక్రియ ముగిసిన తర్వాత, 2027లో తాజా జనాభా లెకల ప్రకారం.. ఇదే 300 వార్డులను మరోసారి డీలిమిటేషన్ చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం స్థానిక సంస్థల విలీనం, వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను హడావుడిగా చేస్తున్న సరారు అంతలోపే జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహిస్తే..పాలక మండలిని అలాగే కొనసాగిస్తూ తాజాగా సేకరించిన జనాభా లెకల ప్రకారం వార్డులను మరోసారి డీలిమిటేషన్, రిజర్వేషన్లను చేపట్టి, తదుపరి నిర్వహించనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు అమలు చేస్తారన్న చర్చ సైతం లేకపోలేదు. ఏకీకృత కార్పొరేషన్‌గానే జనాభా లెకల ప్రక్రియ ముగిసే వరకు జీహెచ్ఎంసీని ఒకే కార్పొరేషన్‌గా కొనసాగించే యోచనలో సరారు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కూడా జీహెచ్ఎంసీ ఒకే కార్పొరేషన్‌గా కొనసాగిస్తారా? లేక ఎన్ని ముకలుగా చేస్తారో కూడా క్లారిటీ రావాల్సి ఉంది.