Obesity | సిటీబ్యూరో, ఏప్రిల్09, (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు మద్యం సేవించే వారికి మాత్రమే ఆందోళన కలిగించేదిగా పరిగణించబడిన ఫ్యాటీ లివర్ ఇప్పుడు ఊబకాయం, మధుమేహం, రక్తపోటుతో ముడిపడి ఉన్న ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా ఉద్భవించింది. మద్యం సేవించని 85శాతం మందిలో ఈ సమస్య వృద్ధి చెందడం ఆందోళన కలిగిస్తోంది. అపోలో హాస్పిటల్స్ ‘హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025 (హెచ్ఓఎన్ 2025) లక్షణాల కోసం వేచి చూడకండి నివారణను మీ ప్రాధాన్యతగా మలుచుకోండి’ నివేదికను విడుదల చేసింది.
అపోలో హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా 25 లక్షల మందికి పైగా వ్యక్తుల ఆరోగ్య పరీక్షల ఆధారంగా ఈ నివేదిక రూపొందించి అందులోని ప్రధాన అంశాలు వెల్లడించింది. లక్షలాది మంది ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికీ దీర్ఘకాలిక అనారోగ్య స్థితిని కలిగి ఉంటున్నారని, 26 శాతం మందిలో హైపర్‌టెన్షన్, 23శాతం మందిలో మధుమేహం గుర్తించినట్లు పేర్కొన్నారు. నివారణ పరీక్షలు పెరగటం లేదని, 2019లో పది లక్షల పరీక్షలు నిర్వహించగా, 2024కు వచ్చేసరికి కేవలం 25లక్షలకు మాత్రమే చేరుకున్నట్లు వెల్లడించింది.
హెచ్ఓఎన్ 2025 నివేదికలో వెల్లడించిన అంశాలను నిర్మాణాత్మక క్లీనిక్‌ల పరిశీలనలు, అపోలో హాస్పిటల్స్ , డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లు, వెల్నెస్ కేంద్రాలలో డీఐడెంటిఫైడ్ ఎలక్ట్రానిక్ మోడల్ రికార్డ్స్ గుండా వెల్లడించడం గమనార్హం. ఫ్యాటీ లివర్ రోగాలు, మెనోపాజ్ తరువాత వచ్చే ఆరోగ్య సమస్యలు, బాల్యదశలో వచ్చే ఉబకాయం వంటి వాటిని వెల్లడించారు.
మద్యపానం చేయని వారిలోనూ..
2,57,199 మందిలో 65శాతం మంది ఫ్యాటీ లివర్‌తో బాధపడుతుండగా వీరిలో 85శాతం మంది మద్యపానం చేయనివారే ఉన్నారు. 46శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేకున్నప్పటికీ అథెరోస్క్లెరోసిస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. మధుమేహం ఒక్కసారిగా 14శాతం నుంచి 40శాతానికి పెరగటం, ఊబకాయం 76శాతం నుంచి 86 శాతానికి పెరిగింది. కళాశాల విద్యార్థులలో 28శాతం మంది అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారు.
19శాతం మంది ప్రీ-హైపర్టెన్సివ్ గా ఉన్నట్లు గుర్తించారు. 4,50,000 కంటే ఎక్కువ మంది వ్యక్తులలో 26శాతం కంటే ఎక్కువ మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. 77శాతం మంది మహిళలు, 82శాతం మంది పురుషులు విటమిన్-డీ లోపం కలిగి ఉన్నారు. 53,000 మందిలో 24శాతం మందికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (ఓఎస్ఏ) ప్రమాదం ఎక్కువగా ఉంది. 59శాతం మందిలో డయాబెటిస్ మార్కర్ తగ్గితే , 51శాతం మందిలో బీపీ తగ్గింది , 47శాతం మంది ప్రవర్తనా పరమైన మార్పుల కారణంగా బరువు తగ్గారు.
ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి
ప్రతి ఇంటిలోనూ ఆరోగ్యానికి అమిత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సంతోషకరమైన, ఆరోగ్యవంతమైన కుటుంబాలను సృష్టించే అవకాశాన్ని పొందేలా భారతదేశం నిలవాలి. నివారణ ఆరోగ్యం అనేది ఇక ఎంతమాత్రమూ భవిష్యత్ కోరిక కాదు.అది నేటి దేశ శ్రేయస్సుకుమూలం. ఈ నివేదిక , వేగంగా మనం చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని, లోతుగా పరీక్షలు చేయించుకోవాల్సిన ఆవశ్యకతను, ప్రతి ఒక్కరికీ ఈ అంశాల పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా తగిన అవకాశాలను కల్పించాల్సిన సమిష్టి బాధ్యతను వెల్లడిస్తుంది.
– డాక్టర్ ప్రతాప్ రెడ్డి, అపోలో హాస్పిటల్స్ చైర్మన్
డ్యూటీలో మద్యం తాగిన వార్డ్బాయ్
వెంగళరావునగర్, ఏప్రిల్ 9 : చీకట్లో ఎవరొస్తారు..ఏం చేసినా ఏం కాదనే తెగింపుతో సర్కారీ దవాఖానలో మద్యం తాగుతూ పట్టుబడ్డాడో వార్డ్ బాయ్. ఆక్సిజన్ ప్లాంట్‌లోని బెడ్ నే టేబుల్‌గా మార్చేసి మద్యం బాటిల్, గ్లాసులు పెట్టుకుని మందేస్తూ చిక్కాడు. ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతి దవాఖానాలో అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతి దవాఖానాలో ఆక్సిజన్ ప్లాంట్ వద్ద వార్డ్ బాయ్ గా విధులు నిర్వహించే మహ్మద్ సాదిక్ అలీ (28).. ఇతను నాలుగో తరగతి ఉద్యోగి.
ఇటీవల నైట్ డ్యూటీకు వచ్చిన సాదిక్ అలి అర్ధరాత్రి వేళ దవాఖానాలోని ఆక్సిజన్ ప్లాంట్ట్లోని బెడ్ పై మద్యం సేవిస్తుండగా అక్కడి రోగి బంధువు.. ఈ తతంగాన్ని వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం అతడు ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ విషయమై ఎర్రగడ్డ చెస్ట్ దవాఖానా సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్నుర్ను వివరణ కోరగా.. దవాఖానలో మద్యం తాగిన వార్డ్ బాయ్ సాదిక్ అలీని విధుల నుంచి తప్పించామని..చార్జ్ మెమో ఇచ్చామని పేర్కొన్నారు.