Sainik School | ఖైరతాబాద్, మే 22: సైనిక్ స్కూల్లో ప్రవేశాల కోసం పరీక్షలు రాసిన తెలంగాణ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందని క్రాంతి కీన్ ఫౌండేషన్ సహాయ కార్యదర్శి కల్యాణి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో జరిగే సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలను అన్ని రాష్ర్టాల నుంచి విద్యార్థులు రాస్తారన్నారు. ఈ ఏడాది కూడా తెలంగాణకు చెందిన విద్యార్థులు ఆంధ్ర ప్రదేశ్‌లోని కోరుకొండ, కలికిరి సైనిక్ స్కూల్ ద్వారా పరీక్షలు రాశారన్నారు.
ఏప్రిల్‌లో హైదరాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్షలు జరిగాయన్నారు. అదేనెల చివరాఖరులో కోరుకొండ సైనిక్ స్కూల్ వెబ్సైట్లో యాజమాన్యం వేసిన పోస్టులు విద్యార్థులకు తీరని బాధను కలిగించిందన్నారు. అందులో తెలంగాణకు చెందిన పిల్లలను స్థానికులుగా గుర్తించమని, స్థానికేతరుల కేటగిరిలోకి వస్తారని పేర్కొన్నారన్నారు. దీంతో పరీక్షలు రాసిన తెలంగాణకు చెందిన దాదాపు 20వేల మంది విద్యార్థుల భవిత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఇక్కడ ఒక ప్రత్యేక సైనిక్ స్కూల్ లేని కారణంగా ఈ సంవత్సరం రాసిన విద్యార్థులకు లోకల్ కోటాలో అవకాశం కల్పిస్తే వారి భవిత నిలబడుతుందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి..
ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి, తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ను కలిసి ఈ విషయమై వినతి పత్రాలు సమర్పించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఇక్కడ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. బాధిత విద్యార్ధి తండ్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. నా బిడ్డను సైనిక్ స్కూల్లో చేర్పించాలన్న ఉద్దేశ్యంతో కోచింగ్ కూడా ఇప్పించానని, స్థానికేతరులుగా ప్రకటించడం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.
ఫౌండేషన్ లీగల్ సెల్ ప్రతినిధి జాకబ్ మాట్లాడుతూ.. ఎంట్రన్స్ పరీక్షలు అయిన తర్వాత స్థానిక అంశంలో నోటిఫికేషన్ విడుదల చేశారని, తద్వారా 20వేల మంది విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికే విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పిల్లలతో పోటీ ఉండటం వల్ల తెలంగాణ వారికి 98శాతం మార్కులు వచ్చినా ఫలితం ఉండదన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఈ ప్రాంతంలోని విద్యార్థులు ఆ పాఠశాలలపైనే ఆధారపడి ఉన్నారన్నారు. ఈ ఏడాది పరీక్షలు రాసిన విద్యార్థులకు లోకల్ కేటగిరిలోనే ప్రవేశాలు ఇవ్వాలన్నారు. ఇక్కడి విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కనీసం మూడు సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలన్నారు.